Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
పౌరసత్వం లేకుండానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేశారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పై నమోదైన కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
- By Gopichand Published Date - 05:29 PM, Thu - 11 September 25

Sonia Gandhi: పౌరసత్వం లేకుండానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేశారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)పై నమోదైన కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. పిటిషనర్, న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వివాదాస్పద అంశంపై సోనియా గాంధీకి తాత్కాలికంగా ఊరట లభించినట్లు అయింది.
పిటిషనర్ ఆరోపణలు
పిటిషనర్ వికాస్ త్రిపాఠి తన వాదనలో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందిన తేదీ, ఓటరు జాబితాలో ఆమె పేరు నమోదు అయిన తేదీల మధ్య వ్యత్యాసాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సోనియా గాంధీ ఏప్రిల్ 30, 1983న భారత పౌరసత్వం పొందారని, అయితే ఆమె పేరు 1980 నాటి ఓటరు జాబితాలో ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆమె భారత పౌరురాలు కాకముందే ఓటరుగా నమోదు అయ్యారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. ముఖ్యంగా 1981-82లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గపు ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చారని, ఇది ఆమె పౌరసత్వం పొందిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.
కోర్టు విశ్లేషణ
పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు, పిటిషనర్ దాఖలు చేసిన ఆరోపణలకు సరైన, బలమైన సాక్ష్యాధారాలు లేవని నిర్ధారించింది. ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చిన తేదీ, ఆమె పౌరసత్వం పొందిన తేదీ మధ్య కాలంలో జరిగిన ప్రక్రియలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరిగాయని నిరూపించడానికి తగిన ఆధారాలు లభించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజకీయ నాయకులపై ఆరోపణలు చేయడం సహజమే అయినప్పటికీ కోర్టులో వాటిని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలని కోర్టు పేర్కొంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తిపై కేసును విచారణకు స్వీకరించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read: India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
విశ్లేషకుల అభిప్రాయం
ఈ కేసు కొట్టివేతపై రాజకీయ, న్యాయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సోనియా గాంధీకి తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు మరిన్ని రావచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే పిటిషన్‌లో బలమైన సాక్ష్యాలు లేకపోవడం వల్లనే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని, న్యాయస్థానాలు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తాయని మరికొందరు పేర్కొంటున్నారు.