13 Killed: అటవీ ప్రాంతంలో మంటలు.. 13 మంది మృతి
వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీలోని (South Central Chile) అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలకు స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే శాంటా జువానా పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 13 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు.
- Author : Gopichand
Date : 04-02-2023 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీలోని (South Central Chile) అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలకు స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే శాంటా జువానా పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 13 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. మంటలను అదుపుచేసే క్రమంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, మెకానిక్ మరణించారు.
అందిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం చిలీ అడవులలో అకస్మాత్తుగా భీకర మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 14 వేల హెక్టార్ల విస్తీర్ణం కాలి బూడిదైందని చెబుతున్నారు. దీనితో పాటు ఈ అగ్నిప్రమాదం కారణంగా రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంటా జువానాలో 11 మంది మరణించారని, అందులో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని సమాచారం.
దీనితో పాటు, లా అరౌకానియాలో సహాయక, రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపిన హెలికాప్టర్ కూలిపోయిందని, ఇందులో పైలట్, మెకానిక్ మరణించారని చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆ దేశ హోం మంత్రి కరోలినా తోహా అన్నారు. బ్రెజిల్, అర్జెంటీనా సహాయంతో 63 విమానాల సముదాయం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది. బయోబియో, నుబల్ పరిసర అటవీ ప్రాంతాలలో ప్రతిచోటా విధ్వంసం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 39 అగ్నిప్రమాదాలు జరిగాయని, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి కరోలినా తోహా చెప్పారు.