Telangana: అర్హులైన లబ్ధిదారులకు అందని ద్రాక్షగా ఆసరా పథకం…?
- By HashtagU Desk Published Date - 10:15 AM, Mon - 21 February 22

తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాల్లో ఆసరా పథకం ఒకటి. అయితే ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు మాత్రం అందడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆసరా పింఛన్‌లు పొందడం కోసం ఎంతో మంది లబ్థిదారులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.57 ఏళ్లు నిండిన వారు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఈ పింఛను అందజేస్తారు. అయితే వీరిలో చాలామందకి ఈ పథకం ద్వారా డబ్బులు అందడంలేదు. వితంతు పింఛను కోసం మూడేళ్ల క్రితం పోచమ్మ అనే మహిళ దరఖాస్తు చేసుకున్నా.. ఇంతవరకు ఆమెకు పింఛను అందలేదని ఆమె ఆరోపించింది. బతుకుదెరువు కోసం అడుక్కుంటూ తిరిగే దుస్థితి ఆమెది. ఒంటరిగా జీవిస్తున్న పోచమ్మకు నిత్యం కావాల్సిన మందులు కొనడం ఇబ్బందికంరంగా మారింది. రైతు స్వరాజ్య వేదిక ఆర్‌టిఐ అభ్యర్థన ద్వారా రాష్ట్రం నుండి ఆసరా పింఛన్లు పొందేందుకు వేచి ఉన్న వారి అధికారిక సంఖ్య 3,15,262 కాగా, ఈ సంఖ్యలో దాదాపు 7,80,000 వృద్ధాప్య పింఛను దరఖాస్తులు చేర్చబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రమాణాలను 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత పెండింగ్‌లో ఉన్న జాబితా ఎక్కువైంది. ప్రస్తుతం 10,86,782 వృద్ధాప్య పింఛన్లు, 13,93,503 మంది వితంతువులు మరియు 4,68,684 మంది వికలాంగులు ఇతర వర్గాలకు చెందిన లబ్ధిదారులతో సహా మొత్తం 36,42,999 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు.