Andhra Pradesh: సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
- Author : hashtagu
Date : 30-12-2021 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవల అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. దాంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. చర్చల తర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
ఇందుకోసం ఆయా థియేటర్ల యజమానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని చెప్పారు. అలాగే, ఆయా థియేటర్లలో నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలని ఆయన సూచించారు. ఆయా థియేటర్ల విషయంలో ఇస్తోన్న సడలింపులపై జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.