CM Jagan: సీఎం జగన్‌తో.. భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు
- By HashtagU Desk Published Date - 11:44 AM, Sat - 5 February 22

ఏపీ ఉద్యోగ సంఘాలతో, రాష్ట్ర మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పలు డిమాండ్లపై జరిగిన చర్చల్లో ఇరుపక్షాలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిపాదనలపై కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాయి.
శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన చర్చలలో ప్రధానంగా పీఆర్సీ, రికవరీ, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏలో శ్లాబ్‌లో సవరణల పై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా, మంత్రుల కమిటీ మాత్రం అందుకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఆ విషయం పై సీయం జగన్‌తో మాట్లాడి చెబుతామని మంత్రులు చెప్పారని తెలుస్తోంది.
ఇక మంత్రుల కమిటీలతో జరిగిన చర్చలు దాదాపు విజయవంతం కావడంతో, ఈ శనివారం ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారని సమాచారం. సీఎం జగన్‌తో చర్చించిన తర్వాతే ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమణ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా రేపు అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే.