Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్
- By Vamsi Chowdary Korata Published Date - 01:05 PM, Fri - 17 October 25

తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది రాజ్యాంగానికి లోబడి ఉంటుందని డీఎంకే వర్గాలు చెబతున్నాయి. డీఎంకే సీనియర్ నేత టీకెఎస్ ఎలంగోవలన్ ఈ బిల్లుపై వ్యాఖ్యానిస్తూ..“మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దానికి కట్టుబడి ఉంటాము. హిందీని విధించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు. అయితే, బీజేపీ నేత వినోజ్ సెల్వం ఈ చర్యను మూర్ఖత్వంతో కూడుకున్నదిగా అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు.తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు వంటి సంబంధిత సమస్యల్ని మళ్లించేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి భాష సెంటిమెంట్‌ని రేకెత్తించాలని డీఎంకే చూస్తోందని పలువురు చెబుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే, ఏఐడీఎంకే మధ్యలోనే పోటీ నెలకొని ఉండేది. ఈ సారి మాత్రం విజయ్ టీవీకే రూపంలో ఎంట్రీ ఇవ్వడంతో పోరు త్రిముఖంగా మారింది. విజయ్‌కి వస్తున్న స్పందన చూసి ఒకింత డీఎంకే భయానికి లోనవుతుందని టీవీకే ఆరోపిస్తోంది.