Crop Insurance: పంట నష్టానికి ఇచ్చిన బీమా అక్షరాల రూ. 1.76/-
ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది.
- By Maheswara Rao Nadella Updated On - 05:35 PM, Tue - 29 November 22

మహారాష్ట్రలో పంట బీమా విషయంలో రైతులకు చిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. పీఎం ఫసల్ బీమా యోజన (PM Fasal Bhima Yojana) కింద కేవలం రూపాయిల్లో పరిహారం అందుతుంటే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ‘పర్బణి’ జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయా, కంది, శనగ పంటలను సాగు చేశాడు. ఇందుకోసం ₹.25,000 పెట్టుబడిగా పెట్టాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది. ఇదే మాదిరి మరో రైతుకు ₹.14.21, మరో రైతుకు ₹.37.31 చొప్పున పంట నష్ట పరిహారం కింద బీమా కంపెనీలు చెల్లించాయి.
రెండు ఎకరాల పంట సాగు కోసం ఓ రైతు బీమా ప్రీమియం రూపంలో ₹.455 చెల్లించాడు. మరో ₹.200ను పంట నష్టం మదింపు చార్జీల కింద చెల్లించాడు. మొత్తం ₹.655 కట్టిన రైతు, ₹.27వేల వరకు పరిహారం వస్తుందని ఆశించగా, వచ్చింది రెండు రూపాయలు కూడా లేదు. ఇక మూడు ఎకరాల్లో మరో రైతు నాలుగు రకాల పంటలను వేయగా, వర్షాల వల్ల కలిగిన నష్టానికి పీఎం ఫసల్ బీమా యోజన కింద పరిహారం కోరాడు. ఒక పంట నష్టానికి ₹.14.21 వచ్చింది. మరో పంట నష్టానికి ₹.1,200 దక్కింది. మిగిలిన రెండు పంటల నష్టాలకు రూపాయి కూడా రాలేదు. కానీ, రైతు చెల్లించిన మొత్తం ప్రీమియం ₹.1,800. దీంతో పంట బీమా పట్ల రైతులు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు.

Related News

PM Kisan: 8 వేలు కాదు.. 6 వేలు మాత్రమే.. ‘పీఎం కిసాన్’ పెంపుపై కేంద్రం రియాక్షన్!
కేంద్రం పీఎం కిసాన్ నిధులను పెంచుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.