Karnataka : మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యల పై.. సీఎం బొమ్మై షాకింగ్ రియాక్షన్..!
- By HashtagU Desk Published Date - 12:38 PM, Fri - 18 February 22

కర్నాటకలో చెలరేగిన హిజాబ్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం పై అక్కడి హైకోర్టు మధ‍్యంతర ఆదేశాలు జాదీ చేయడంతతో, కర్నాటకలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే పలు కాలేజీల్లో హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తుండడంతో, అక్కడ ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒవైపు రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతుంటే, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈశ్వరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు, తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేఎస్ ఈశ్వరప్పను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలు, రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ సీయం యడ్యూరప్ప, నిరసనలు విరమింప జేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇక మరోవైపు నిరసన చేస్తే చేసుకోనివ్వండంటూ ఈశ్వరప్ప వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఈశ్వరప్ప వ్యాఖ్యల పై సీయం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఎప్పటికైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగిరితీరుతుందన్న మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదదని బొమ్మై అన్నారు.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యల్లో పూర్తి స్పష్టత ఉందని, ఇప్పటికిప్పుడే ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందని ఈశ్వరప్ప అనలేదని, మరో 500 ఏళ్ళ తర్వాతైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాత్రమే ఆయన అన్నారని సీఎం బొమ్మై పేర్కొన్నారు. అయితే అలా జరగొచ్చు, లేదా జరగకపోవచ్చని బొమ్మై వ్యాఖ్యానించారు. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యల పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం బొమ్మై కాంగ్రెస్ నేతల పై మండిపడ్డారు.ఏది ఏమైనా ఒకవైపు హిజాబ్, మరోవైపు ఎర్రకోట పై కాషాయ జెండ వివాదాలు కర్నాటక రాజకీయాల్లో హీట్ పెంచాయి.