CBI Raids : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విద్యాసంస్థలపై సీబీఐ రైడ్స్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెందిన విద్యాసంస్థపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు
- Author : Prasad
Date : 19-12-2022 - 5:42 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెందిన విద్యాసంస్థపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లో ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌పై రైడ్ చేసి పత్రాల పరిశీలన చేపట్టారు. ఫౌండేషన్ చైర్మన్‌గా శివకుమార్, కార్యదర్శిగా ఆయన కుమార్తె ఈశ్వర్య ఉన్నారు. శివకుమార్ తన విద్యాసంస్థలపై సీబీఐ దాడులు నిర్వహించిందని తెలిపారు. తమ భూమి, వ్యాపారంపై సీబీఐ విచారణ జరుపుతోందని… మా కుటుంబాన్ని దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయని ఆయన అన్నారు. అన్ని విచారణ ఏజెన్సీలు ఫిర్యాదులను నమోదు చేసి విచారణలు నిర్వహించాయి. తన భాగస్వాములు, బంధువులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసి సమాచారం రాబట్టారని తెలిపారు. తానేమి తప్పు చేయలేదని,,భయపడనని శివకుమార్ తెలిపారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ ద్వారా కాంగ్రెస్ నేతలను చిత్రహింసలకు గురిచేయడమే ప్రధాన లక్ష్యమని శివకుమార్ వివరించారు.