Ayodhya Ram Mandir : అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు,
- Author : Vamsi Chowdary Korata
Date : 23-10-2025 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శీతాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్ తెలియజేసింది. నూతనంగా సవరించిన ఈ వేళలు గురువారం అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రోజులో మొదటి ఆరాధన అయిన మంగళ హారతిని తెల్లవారుజామున 4 గంటలకే ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఇచ్చే శృంగార హారతిని 6.30 గంటలకు ఇవ్వనున్నారు. గతంలో రామమందిర ప్రాంగణాన్ని ఉదయం 6.30 గంటలకే భక్తుల కోసం తెరిచేవారు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం.. దర్శనం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా భోగ హారతిని మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న నైవేద్యం నివేదించనున్నారు. అనంతరం అంటే 12.30 నుంచి 1 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనాన్ని పునఃప్రారంభిస్తారు. అలాగే దర్శనానికి చివరి అనుమతిని రాత్రి 9.30 గంటల వరకు అంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తారు. అలాగే రోజులో చివరి ఆరాధన అయిన శయన హారతిని రాత్రి 9.30 గంటలకు నిర్వహిస్తారు. ట్రస్ట్ కొత్తగా ప్రవేశానికి సంబంధించిన మరికొన్ని నిబంధనలను కూడా ప్రకటించింది. అలాగే బిర్లా ధర్మశాల ముందు ఉన్న గేటు వద్ద ఉదయం 8.30 గంటలకే భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. ఉదయం 9 గంటల తర్వాత సెక్యూరిటీ గేట్ డీ1 నుంచి కూడా ఆలయంలోకి అనుమతి ఇవ్వబడదని ట్రస్ట్ స్పష్టం చేసింది. భక్తులు ఈ నూతన వేళలు, నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్య యాత్రను ప్లాన్ చేసుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.