Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్
తండ్రీ కొడుకు ప్రజ్వల్(Prajwal Revanna), హెచ్‌డీ రేవణ్ణలపై నమోదైన 4 కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ఛార్జిషీట్‌లో వివరంగా ప్రస్తావించారు.
- By Pasha Published Date - 04:12 PM, Sat - 24 August 24

Prajwal Revanna : సెక్స్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన కుమారుడు హెచ్‌డీ రేవణ్ణలపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) ఇవాళ 2,144 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని ఈరోజు బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సిట్ సమర్పించింది. తండ్రీ కొడుకు ప్రజ్వల్(Prajwal Revanna), హెచ్‌డీ రేవణ్ణలపై నమోదైన 4 కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ఛార్జిషీట్‌లో వివరంగా ప్రస్తావించారు. ఇందులో 150 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. ఈ ఛార్జిషీట్‌లో వివిధ విధానాల ద్వారా సేకరించిన ఆధారాలను సిట్ అధికారులు చేర్చారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఏడాది ఏప్రిల్ 26న రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడు.హోలెనరసిపురలోని హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో 2019 నుంచి 2022 మధ్య కాలంలో పనిచేసిన మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, ప్రజ్వల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు బాధిత మహిళ కుమారుడు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించాడని ఆ కంప్లయింటులో ప్రస్తావించాడు. ఈనేపథ్యంలో రేవణ్ణపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), ఆయన కుమారుడు ప్రజ్వల్‌పై ఐపీసీ 376, ఐపీసీ 376 (2), ఐపీసీ 354, ఐపీసీ 354(ఏ), ఐపీసీ 354(బీ) సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
Also Read :Iron Dome For Mosquitoes : దోమలను వెతికి చంపే ‘ఐరన్ డోమ్’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
మరెంతో మంది మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాత దేవెగౌడ పిలుపు మేరకు మళ్లీ భారత్‌కు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులకు లొంగిపోయాడు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.