Triple Talaq : మోడీ, యోగిలను పొగిడిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్
ఈమేరకు సదరు మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- By Pasha Published Date - 02:35 PM, Sat - 24 August 24

Triple Talaq : ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా ? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పదేపదే భార్య పొగుడుతోందని అతడు ఆగ్రహించాడు. అయోధ్య కోసం మోడీ, యోగి ఎంతో కష్టపడ్డారని భార్య చెప్పడంతో రగిలిపోయాడు. వెంటనే తన భార్యకు అతడు మూడుసార్లు తలాఖ్(Triple Talaq) చెప్పేశాడు. ఈమేరకు సదరు మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో పాటు అత్త తనపై దాడి చేసిందని కంప్లయింట్‌లో పేర్కొంది. ఉరి వేసి తనను చంపేందుకూ యత్నించారని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
వివరాల్లోకి వెళితే.. 2023లో ఈ దంపతులకు పెళ్లయింది. సదరు మహిళ అయోధ్య మార్గంలో కొత్తగా నిర్మించిన రోడ్లను చూసి ఆశ్చర్యపోయింది. అవి చాలా అందంగా ఉండటంతో అబ్బురపడింది. ఈక్రమంలోనే ఇంట్లో భర్తతో సరదాగా మాట్లాడుతూ మోడీ, యోగిలను సదరు మహిళ పొగిడింది. అప్పటి నుంచి ఆ మహిళతో భర్త ప్రవర్తన మారిపోయింది. ఓసారి వేడి పప్పు భార్యపైకి విసిరాడు. అనంతరం భార్యను పుట్టింటికి పంపాడు. కొన్ని రోజులకే మళ్లీ ఆ మహిళ భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఓసారి భార్యపై కోపంతో రగిలిపోయిన భర్త.. ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు.
Also Read :Nagarjuna : ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత.. హీరో నాగార్జున కీలక ప్రకటన
ఇటీవలే ట్రిపుల్ తలాఖ్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక వాదనలు వినిపించింది. ఈ ఆచారం వల్ల ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మారిందని మోడీ సర్కారు ఆవేదన వ్యక్తం చేసింది.ఈమేరకు సోమవారం రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని 2017లోనే సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది’’ అని అఫిడవిట్‌లో కేంద్రం ప్రస్తావించింది. ‘‘ట్రిపుల్ తలాఖ్ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. ట్రిపుల్ తలాఖ్ చెప్పేవారిని శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు లేవు. దీంతో బాధిత మహిళల భర్తలపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో పోలీసులు నిస్సహాయంగా మారారు’’ అని కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో వాదించింది. ఈ తరహా విడాకులను అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు అవసరమని పేర్కొంది.