Nagabandham: నాగబంధం మూవీ రివ్యూ
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
Nagabandham సనాతన ధర్మం, పురాతన విష్ణు ఆలయాల రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా హీరో విరాట్ కర్ణ పవర్‌ఫుల్ నటన, నభా నటేష్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 100% తెలుగు సాంకేతిక నిపుణులు రూపొందించిన విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో మైథాలజీ, సోషియో ఫాంటసీ జోనర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే బాటలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాజా చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. యువ నటుడు విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంపై టీజర్, ట్రైలర్ల నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా దర్శకుడిగా మారి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించారు. ఐశ్వర్యా మీనన్, దక్ష నగర్కర్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, రిషభ్ సాహ్నీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మన పురాతన విష్ణు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, సనాతన ధర్మం మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో, ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో వివరంగా చూద్దాం.
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ హీరో విరాట్ కర్ణ నటన. శివుడి తరహా మాస్ లుక్‌లో, ముఖ్యంగా ఒక నాగసాధువు పాత్రలో విరాట్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడని, ముఖ్యంగా క్లైమాక్స్ చివరి 20 నిమిషాల్లో ఆయన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయని నెటిజన్లు రాసుకొస్తున్నారు. చాలా కాలం తర్వాత స్క్రీన్ పైకి వచ్చిన నభా నటేష్ తన పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ఇక సాంకేతిక విలువల విషయానికి వస్తే, 100 శాతం తెలుగు సాంకేతిక నిపుణులే రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు అందుతున్నాయి. పురాతన ఆలయాల సెట్టింగులు, సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. దీనికి తోడు జునైద్ కుమార్ మరియు అబీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా “నమో రే” సాంగ్ థియేటర్లను షేక్ చేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
సినిమాలో ప్రధాన మైనస్ పాయింట్ బలహీనమైన కథనం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దర్శకుడు అభిషేక్ నామా విజువల్స్‌పై పెట్టిన శ్రద్ధ కథ, భావోద్వేగాలపై పెట్టలేదని అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని, కొన్ని చోట్ల CGI వర్క్ అంతగా బాగాలేదని ట్వీట్స్ చేస్తున్నారు. పాటల ప్లేస్‌మెంట్ సరిగ్గా లేకపోవడం, లెంగ్తీ రన్‌టైమ్ మరియు మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ, లాజిక్ లేని సీన్లు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయని, కేవలం ఆర్ట్ డిపార్ట్‌మెంట్, హీరో నటన మినహా సెకండాఫ్‌లో చెప్పుకోదగ్గ అంశాలు లేవని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్, మైథాలజీ అంశాలను ఇష్టపడే వారికి ‘నాగబంధం’ ఒక మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది, కానీ బలమైన కథను ఆశించి వెళ్లే వారికి మాత్రం ఈ చిత్రం కొంత నిరాశ కలిగించవచ్చు.