ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ అవసరం లేదు.. వెజిటేరియన్లకు టాప్ ఫుడ్స్ ఇవే..!
మొక్కల నుంచి లభించే ప్రోటీన్ వనరులు కేవలం కండరాల ఆరోగ్యానికే కాదు జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి మైక్రోబయోమ్‌ను బలోపేతం చేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగవుతుంది.
- Author : Latha Suma
Date : 27-01-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
. మొక్క ఆధారిత ప్రోటీన్ ప్రయోజనాలు
. పచ్చిబఠాణీలు..సోయాబీన్స్, ఓట్స్ శక్తి
. టెంపే..కాయధాన్యాలతో సంపూర్ణ పోషణ
Proteins: మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రోటీన్ ఎంతో కీలకం. కండరాల బలవృద్ధి, కణాల మరమ్మత్తు, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల తయారీ, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక పనుల్లో ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చికెన్, గుడ్లు, చేపలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో శాకాహారులకు సరైన ప్రోటీన్ దొరకడం కష్టం అనిపిస్తుంది. కానీ వైద్యులు, పోషకాహార నిపుణుల మాట ప్రకారం మొక్క ఆధారిత ఆహారాలతో కూడా శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ పొందవచ్చు.
మొక్కల నుంచి లభించే ప్రోటీన్ వనరులు కేవలం కండరాల ఆరోగ్యానికే కాదు జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి మైక్రోబయోమ్‌ను బలోపేతం చేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. వాపు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా మొక్క ఆధారిత ఆహారాల్లో ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సరైన ప్రోటీన్ వనరులను ఎంపిక చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఒకేసారి పొందవచ్చు.
శాకాహారులు రోజువారీ ఆహారంలో పచ్చిబఠాణీలను చేర్చుకుంటే మంచి ప్రోటీన్ అందుతుంది. అర కప్పు పచ్చిబఠాణీల్లో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో విటమిన్ కె, ఫైబర్, జింక్ వంటి పోషకాలు కూడా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. కూరలుఫ్రైడ్ రైస్, సలాడ్లలో పచ్చిబఠాణీలను కలిపితే రుచి, ఆరోగ్యం రెండూ పెరుగుతాయి. అలాగే సోయాబీన్స్ ప్రోటీన్‌కు మంచి మూలం. అర కప్పు సోయాబీన్స్‌లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లేవోన్లు పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియాను పెంచుతాయి. ఓట్స్ కూడా శాకాహారులకు చక్కటి ఎంపిక. ఒక కప్పు ఓట్స్‌లో 10 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
సోయాబీన్స్‌తో తయారయ్యే టెంపే శాకాహారులకు ప్రోటీన్ బాంబ్ లాంటిది. 100 గ్రాముల టెంపేలో సుమారు 19 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది పులియబెట్టిన ఆహారం కావడంతో పేగు ఆరోగ్యానికి మరింత ఉపయోగకరం. అలాగే కాయధాన్యాలు కూడా ప్రోటీన్, ఫైబర్ రెండింటికీ మంచి వనరు. అర కప్పు కాయధాన్యాల్లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. శాకాహారులు ప్రోటీన్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. సరైన మొక్క ఆధారిత ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకుంటే కండరాల ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం అన్నీ మెరుగవుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.