మేడారంలో ‘మావోరి’ (Maori) తెగ ‘హాకా’ డాన్స్, ఆశ్చర్యంలో భక్తులు
తాజాగా ఈ జాతరలో విదేశీ ప్రతినిధుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన 'మావోరి' (Maori) తెగ ప్రతినిధులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకోవడం జాతర యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును చాటిచెబుతోంది
- Author : Sudheer
Date : 27-01-2026 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
Maori Kapa Haka -Medaram : తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ ఏడాది సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ కావడంతో, దీని విశిష్టత ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. తాజాగా ఈ జాతరలో విదేశీ ప్రతినిధుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన ‘మావోరి’ (Maori) తెగ ప్రతినిధులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకోవడం జాతర యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును చాటిచెబుతోంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల కలయికగా సాగే ఈ ఉత్సవాల్లో ఇతర దేశాల తెగలు పాలుపంచుకోవడం సాంస్కృతిక వారధిగా నిలుస్తోంది.

మేడారంలో ‘మావోరి’ (Maori) తెగ ‘హాకా’ డాన్స్, ఆశ్చర్యంలో భక్తులు
ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మావోరి తెగ వారు మేడారం గడ్డపై ప్రదర్శించిన ‘హాకా’ (Haka) నృత్యం. సాధారణంగా యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో వీరావేశాన్ని నింపడానికి, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడానికి ఈ నృత్యాన్ని చేస్తారు. కళ్లు పెద్దవి చేసి, నాలుక బయటపెట్టి, శబ్దాలు చేస్తూ చేసే ఈ నృత్యం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఒక యువ ఎంపీ ఈ ‘హాకా’ ప్రదర్శన చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయి వీరోచిత నృత్యం మన మేడారం జాతరలో కనిపించడం గిరిజన సంప్రదాయాల పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం.

maori-tribe-performs-haka-dance
భారీగా తరలివచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, రూ. 251 కోట్లతో ఘాట్లు, ఆలయ ప్రాంగణాలను అభివృద్ధి చేశారు. టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) 4,000 ప్రత్యేక బస్సుల ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుండగా, భద్రత కోసం 15 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీయుల రాకతో ఈసారి మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించడమే కాకుండా, మన గిరిజన వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశంగా మారింది.