Tea & Coffee: ఉదయాన్నే టీ, కాఫీ లకు బదులు ఈ ఆహారాలతో మీ రోజును మొదలుపెట్టండి.
ఉదయం లేచిందే కాఫీ కోసమో, టీ కోసమో చేయి లాగుతూ ఉంటుంది. కానీ వాటిని మానేయాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
- Author : Maheswara Rao Nadella
Date : 08-03-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉదయం లేవగానే అందరి పొట్ట ఖాళీగా ఉంటుంది. అందుకే పరగడుపున ఏదో తినాలన్న అంశంపై ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. ఎన్ని జరిగినా కూడా అందరూ పరగడుపున తాగేది టీ (Tea) లేదా కాఫీయే (Coffee). ఈ రెండూ కూడా ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల అనర్ధాలే తప్ప, ఆరోగ్యం లేదు. ఉదయం పూట ఏదైనా తిన్న తర్వాత ఈ కాఫీ, టీలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే టీ (Tea) శరీరానికి శక్తిని అందిస్తూనే, నిద్రను, నీరసాన్ని దూరం చేస్తుంది. కాఫీ (Coffee) కూడా దానిలో ఉండే కెఫిన్ కారణంగా చురుకుతనాన్ని ఇస్తుంది. కానీ ఖాళీ పొట్టతో ఈ రెండిటినీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ వంటి ఆమ్ల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. వీటికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం మంచిది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూనే నిద్రను బద్ధకాన్ని వదలగొట్టేలా ఉండాలి. ఆ ఆహారాలు పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చాయ్, కాఫీలను పక్కనపెట్టి పరగడుపున కింద చెప్పిన ఆహారాలతో రోజును ప్రారంభించమని చెబుతున్నారు.
ఖర్జూరాలు:
ఉదయం నిద్ర లేవగానే కాఫీనో, టీనో చేత్తో పట్టుకునే బదులు ఖర్జూరాలను తినడం మంచిది. వీటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి అవి మీకు రోజంతా శక్తినిస్తాయి. ఉదయం పూట నాలుగు నుంచి ఐదు ఖర్జూర పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ అందుతుంది.
బాదంపప్పులు:
వీటిలో ప్రోటీన్, ఫైబర్, మోనో శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటి వల్ల విటమిన్ బి అధికంగా లభిస్తుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. బాదంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది కండరాలు అలసిపోకుండా కాపాడుతుంది. ఉదయం పూట పరగడుపున నానబెట్టిన నాలుగైదు బాదం పప్పులు తినడం మంచిది.
నారింజ:
ఈ పండులో విటమిన్ సి అధికం. ఇది కాకుండా ఫాస్పరస్, ఫైబర్, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి అవసరమైన పోషణను శక్తిని అందిస్తాయి. ఉదయం కాఫీకి బదులుగా నారింజ రసంతో మీ రోజున ప్రారంభించడం మంచిది.
నిమ్మ పుదీనా:
నిమ్మకాయ, పుదీనాతో కలిపి చేసిన పానీయాన్ని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి సాంత్వన కలుగుతుంది. నిమ్మకాయ శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. ఇది సహజంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి నీరు చాలా అవసరం. నిమ్మకాయ, పుదీనా డ్రింక్ తాగడం వల్ల డీహైడ్రెషన్ బారిన పడే అవకాశం తగ్గుతుంది.
నువ్వుల గింజలు:
నువ్వుల గింజలను కళాయిలో కాసేపు వేపుకుని ఒక డబ్బాలో ఉంచుకోవాలి. వాటిని ప్రతి ఉదయం పరగడుపున ఓ గుప్పెడు తినాలి. వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన తరువాత ఈ నువ్వులు తినడం వల్ల కండరాల నొప్పి, అలసట వంటి సమస్యలు రావు. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
Also Read: Elephant: ఏనుగు మామూళ్లు వసూలు చేయడం చూసారా..?