Parliament winter sessions: వింటర్‌లో వేడి ఖాయమే..!
- By Gopichand Published Date - 07:36 AM, Wed - 7 December 22

రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter sessions) వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తుండగా.. ధరల పెరుగుదల సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి 31 పార్టీలు హాజరయ్యాయి.అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్రం.. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను కోరింది. వింటర్ సెషన్ (Parliament winter sessions)లో మొత్తం 16 బిల్లులు ఉభయసభల ముందుకు తీసుకురానుంది మోదీ సర్కార్.
వీటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ-స్టేట్ కోపరేటివ్ సొసైటీలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, చైనా సరిహద్దులో ప్రతిష్టంభన, MSP, EWS కోటా అంశాలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. క్రిస్మస్ వరకూ సమావేశాలు కొనసాగించడంపైనా అభ్యంతరం వ్యక్తంచేశాయి. శీతాకాల సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే YSR కాంగ్రెస్ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్.
Also Read: MP Gorantla: ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం!
వింటర్ సెషన్ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రస్తుత భవనంలో శీతాకాల సమావేశాలే చివరివి కాగా.. వచ్చే ఏడాది జరిగే బడ్జెట్ సమావేశాలను నూతన పార్లమెంట్ బిల్డింగ్‌లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వింటర్ సెషన్‌కు హాజరు కాబోరని వెల్లడించాయి పార్టీ వర్గాలు.