Nagarjuna : ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత.. హీరో నాగార్జున కీలక ప్రకటన
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు.
- By Pasha Published Date - 01:44 PM, Sat - 24 August 24

Nagarjuna : ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’ను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) విభాగం కూల్చివేయడంపై హీరో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయడం బాధాకరమన్నారు. ‘‘మా ప్రతిష్ఠను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ ప్రకటన జారీ చేస్తున్నాను’’ అని ఆయన తెలిపారు. ‘‘ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినది పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది’’ అని నాగార్జున స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు. కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున(Nagarjuna) ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని ఆయన తెలిపారు. ‘‘చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఒకవేళ కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఎన్ కన్వెన్షన్‌ను నేనే కూల్చి ఉండేవాణ్ని. ఇప్పుడు జరిగినదంతా చూసి మేమేదో కబ్జాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం’’ అని నాగార్జున చెప్పారు. ‘‘దీనిపై మేం కోర్టును ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా నాగార్జున ఒక పోస్ట్ చేశారు.
Also Read :Sonobuoy : భారత సైన్యానికి రూ.442 కోట్ల ‘సోనో బ్యుయ్’లు.. ఏమిటివి ?
హీరో నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటరు నిర్మాణంపై హైడ్రా అధికారులకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందువల్లే ఇవాళ కూల్చివేత చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారట. ఆయన ఈనెల 21నే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు లేఖ రాశారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ లో ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆయన ఆరోపించారు. శాటిలైట్ ఫోటోలతో సహా పలు ఆధారాలను తన ఫిర్యాదుకు జత చేశారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్-కన్వెన్షన్ నిర్మాణం ఉండగా.. దానిలోని 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా అధికారులు అంటున్నారు. మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉందని చెబుతున్నారు. చెరువు ఆక్రమణ జరిగిన నేపథ్యంలోనే కూల్చివేశామని తమ చర్యలను హైడ్రా అధికార వర్గాలు సమర్ధించు కుంటున్నాయి. కాగా, మాదాపూర్‌లోని ఎన్-కన్వెన్షన్‌లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి భాగస్వామ్యులుగా ఉన్నట్లు సమాచారం.