Aadhaar: ఆధార్ కార్డుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తక్షణమే ఆధార్ కార్డును DOB ధృవీకరణ పత్రంగా అంగీకరించడం మానుకోవాలని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. తమ అధీనంలో ఉన్న కార్యాలయాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది.
- By Gopichand Published Date - 08:00 PM, Fri - 28 November 25
Aadhaar: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఆధార్ కార్డు (Aadhaar) ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా చెల్లదు. ఈ మేరకు ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డులో నమోదు చేయబడిన పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఎటువంటి ప్రామాణిక పత్రం ఆధారంగా నిర్ణయించబడదు. కాబట్టి దీనిని అధికారిక పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా అంగీకరించలేమని ఈ ఉత్తర్వులో పేర్కొనబడింది.
ప్రభుత్వ ఉత్తర్వులో ఏముంది?
ప్రణాళికా విభాగం ప్రత్యేక కార్యదర్శి జారీ చేసిన లేఖలో నియామకాలు, వివిధ ప్రభుత్వ సేవలు, దరఖాస్తు ప్రక్రియలు, ధృవీకరణ పనుల్లో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి రుజువుగా ఉపయోగించకూడదు అని పేర్కొన్నారు. ఆధార్ కార్డు నమోదు చేసేటప్పుడు వ్యక్తి పుట్టిన తేదీని ఏదైనా చెల్లుబాటు అయ్యే పత్రంతో ధృవీకరించరు. అనేక సందర్భాల్లో ఇది వ్యక్తి స్వయం ప్రకటితం అయి ఉంటుంది.
UIDAI సూచనల ఆధారంగా నిర్ణయం
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రాంతీయ కార్యాలయం పంపిన లేఖ ఆధారంగా తీసుకుంది. UIDAI ప్రకారం.. ఆధార్ తయారు చేసే ప్రక్రియలో జనన ధృవీకరణ పత్రం, స్కూల్ రికార్డు లేదా ఆసుపత్రి నుండి జారీ చేసిన ఏదైనా పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి ఆధార్‌లో నమోదు చేసిన పుట్టిన తేదీని ప్రామాణికమైనదిగా పరిగణించలేము.
Also Read: Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
తక్షణమే నిలిపివేయాలని ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తక్షణమే ఆధార్ కార్డును DOB ధృవీకరణ పత్రంగా అంగీకరించడం మానుకోవాలని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. తమ అధీనంలో ఉన్న కార్యాలయాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షన్, స్కాలర్‌షిప్, లైసెన్స్, ప్రభుత్వ పథకాలు మరియు ఏదైనా గుర్తింపు లేదా వయస్సు సంబంధిత ప్రక్రియల్లో పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
- జనన ధృవీకరణ పత్రం
- హైస్కూల్ సర్టిఫికేట్
- నగర పాలక సంస్థ జారీ చేసిన జనన నమోదు రికార్డు
- ఇతర అధీకృత పత్రాలు
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా..
మహారాష్ట్రలో కూడా ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. ఆలస్యంగా జనన ధృవీకరణ పత్రాన్ని పొందడానికి ఆధార్ కార్డును పత్రంగా పరిగణించబడదు అని పేర్కొంది.