Soldiers : మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:56 PM, Wed - 18 December 24

Soldiers : రాజస్థాన్‌లో మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. రాజస్థాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సైనికులకు శిక్షణ తరగతులు బోధిస్తుంటారు. బుధవారం శిక్షణలో భాగంగా సైనికులు యుద్ధ ట్యాంకులో మందుగుండు సామగ్రి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల్లో ఒకరైన అశుతోష్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతానికి చెందినవారు కాగా, జితేంద్ర స్వస్థలం రాజస్థాన్‌లోని దౌసా. వారి మృతదేహాలను సూరత్‌గఢ్ మిలటరీ స్టేషన్‌కు తరలించారు. ఇది ఈ వారంలో రేంజ్‌లో జరిగిన రెండో ప్రమాదమని సైనికాధికారులు పేర్కొన్నారు. మందుగుండు సామాగ్రిని లోడ్ చేస్తుండగా ఛార్జర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ వెల్లడించారు. గాయపడిన సైనికుడిని హెలికాప్టర్‌లో చండీగఢ్‌కు తరలించామన్నారు.
కాగా, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వారం వ్యవధిలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇది రెండో ఘటన. ఈ నెల 15న ట్రైనింగ్ సమయంలో ఓ సైనికుడు వీరమణం పొందాడు. చంద్ర ప్రకాష్ పటేల్ టోయింగ్ వాహనానికి తుపాకీని అటాచ్ చేస్తున్నప్పుడు, తుపాకీ గన్ మౌంట్ ర్యాంప్‌పై ట్రాక్షన్ కోల్పోయి వెనుక్కు జారింది. దీంతో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫీల్డ్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే చనిపోయినట్లుగా తెలిపారు.