Ebrahim Raisi Death: రైసీకి ఇండియా సంతాపం.. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా
రాష్ట్రపతి రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఈరోజు మంగళవారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించింది. దీని కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేయనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:03 PM, Tue - 21 May 24

Ebrahim Raisi Death: ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో పాటు మరో ఏడుగురు మరణించారు. రాష్ట్రపతి రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఈరోజు మంగళవారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించింది. దీని కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేయనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో “భారతదేశం అంతటా సంతాప దినం రోజున అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు. దీనితో పాటు దేశంలో ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించబడవని పేర్కొంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఐదు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మరోవైపు మొదటి ఉపాధ్యక్షుడు మహ్మద్ మొఖ్బర్ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రైసీ మరణంతో దేశంలో ఐదు రోజుల జాతీయ సంతాప దినాలను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఇక హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆకస్మిక మరణం భారతదేశానికి పెద్ద నష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే చైనా, పాకిస్థాన్‌లు ఒత్తిడి చేసినా భారత్‌కు చాబహార్ ఓడరేవును అప్పగించేందుకు మార్గాన్ని సుగమం చేశారు ఇరాన్ అధ్యక్షుడు రైసీ. ఇది కాకుండా ఇరాన్ ఇస్లామిక్ దేశమైనప్పటికీ, కాశ్మీర్ సమస్యపై రైసీ ప్రభుత్వం ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతు ఇచ్చింది.
ఇబ్రహీం రైసీకి చెందిన హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని పర్వత అటవీ ప్రాంతంలో కొండలను ఢీకొనడంతో కూలిపోయింది. హెలికాప్టర్ కుప్పకూలినప్పుడు దట్టమైన పొగమంచు అలుముకుంది. నిరంతర వర్షం కారణంగా రెస్క్యూ బృందం కూడా ఇబ్బందులను ఎదుర్కొంది. వారు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సోమవారం ఉదయానికి రెస్క్యూ టీమ్ ప్రమాద స్థలికి చేరుకొని మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.
Also Read: TS : ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారు: సీఎం రెవంత్ రెడ్డి