Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 01:42 PM, Tue - 29 July 25

Lok Sabha : పహల్గాం అమానుష ఉగ్రదాడికి సంబంధించి కీలక పురోగతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభ వేదికగా ప్రకటించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని తెలిపారు. హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పాక్‌లో తయారైన పత్రాలు, చాక్లెట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఆధారాలన్నీ దృఢంగా ఉన్నాయని వెల్లడించారు.
పహల్గాం దాడి జరిగిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లినట్టు తెలిపారు అమిత్ షా. బాధితులను స్వయంగా కలిసినట్టు తెలిపారు. మతం పేరుతో అమాయక పర్యాటకులను టార్గెట్ చేసిన ఈ దాడి పాఠశాలల్లో కూడా చదువించాల్సినంత దారుణం అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, కేసు ఇప్పుడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎన్‌ఐఏ) అప్పగించామని తెలిపారు. దాడిలో దొరికిన తుపాకులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు, కొన్ని కీలక సమాచారం కూడా ఫోరెన్సిక్ నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఉగ్రవాదులకు సహకరించిన వారి పట్ల కూడా చర్యలు ప్రారంభమయ్యాయని, వారిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుందని వివరించారు. ఈ దాడిపై ప్రభుత్వ స్పందన ఎంత ఘాటుగా ఉందో ఈ చర్యలు సూచిస్తున్నాయని స్పష్టం చేశారు.
విపక్ష విమర్శలపై తీవ్ర స్థాయిలో స్పందించిన అమిత్‌షా
ఈ సందర్భంగా మాజీ హోంశాఖ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారా? దానికి ఆధారాలున్నాయా? అని చిదంబరం లేవనెత్తిన ప్రశ్నను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా ఖండించారు. మీరు కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. మా వద్ద ఉన్న ఆధారాలు స్పష్టమైనవి. ఇది ఎవరినీ విమర్శించేందుకు కాదు, నిజాలను చెప్పేందుకు మాత్రమే అని పేర్కొన్నారు. అంతేగాక, చిదంబరం ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌ఐఏ దర్యాప్తు వివరాలు బయటపెట్టడం లేదని చేసిన వ్యాఖ్యలపై కూడా షా స్పందించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. కేసు పరిణామాల ప్రకారం విచారణ సాగుతుంది. ప్రభుత్వానికి నిజాలు దాచే ఉద్దేశం లేదు అని తెలిపారు.
భద్రతా బలగాలకు అభినందనలు
ఈ సందర్భంగా అమిత్ షా జమ్మూకశ్మీర్ భద్రతా దళాలు, పోలీసు శాఖను ప్రత్యేకంగా అభినందించారు. పహల్గాం ఘటనపై వారు చూపిన వేగవంతమైన చర్య వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాం అని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రం తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతి, భద్రతా దళాల పనితీరుపై అమిత్ షా చేసిన ప్రకటనకు పార్లమెంట్ వేదికగా స్పందనలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రధాన నిందితుల హతమౌతం శాంతి ప్రాధాన్యానికి సంకేతంగా మారిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత