Bomb Threat : ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు తిరువనంతపురానికి చేరుకున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
- Author : Pasha
Date : 22-08-2024 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
Bomb Threat : కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీని(Bomb Threat) ప్రకటించారు. ముంబై నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు తిరువనంతపురానికి చేరుకున్న ఎయిర్ ఇండియా (657) విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆ విమానాన్ని మిగతా విమానాల నుంచి వేరు చేశారు. విమానం నుంచి వేగంగా ప్రయాణికులను కిందికి దింపారు. పైలట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ మెసేజ్ పంపారని తెలిసింది. విమానం మార్గం మధ్యలో ఉండగానే పైలట్ నుంచి తిరువనంతపురం ఎయిర్‌పోర్టు అధికారులకు ఈ సమాచారం అందింది. ఆ విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ఇంతకీ వార్నింగ్ ఇచ్చింది ఎవరు ? ఎందుకు ఇచ్చారు ? అనేది తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఏడాది జూన్ 17న కూడా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్‌కు బయలుదేరుతున్న ఒక విమానానికి కూడా ఇదే విధమైన బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని, దాన్ని పేల్చేస్తామని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. చివరకు దర్యాప్తు చేస్తే ఈమెయిల్ పంపింది ఒక 13 ఏళ్ల బాలుడు అని వెల్లడైంది.అప్పట్లో ఈమెయిల్ అందిన వెంటనే ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు వెళ్లే విమానాన్ని చాలాసేపు తనిఖీ చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆ అబ్బాయి ఆటపట్టించేందుకు మాత్రమే ఈమెయిల్ చేశాడని వెల్లడైంది. గతంలో ఎవరో వేరే కుర్రాడు ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పడం ఆ బాలుడికి నచ్చిందని.. తాను కూడా ఓసారి ట్రై చేసి చూద్దామని ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వార్నింగ్ ఈమెయిల్‌ను పంపాడని విచారణలో గుర్తించారు.
Also Read :Neuralink : మెదడులోకి చిప్.. ‘న్యూరాలింక్’ రెండో ప్రయోగం సక్సెస్
ఈ ఏడాది జూన్ 18న మన దేశంలోని 41 ఎయిర్ పోర్టులకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా ఎయిర్ పోర్టులలో కార్యకలాపాలు గంటల తరబడి ఆగిపోయాయి. ఈ ఏడాదిలోనే రెండు నెలల క్రితం ముంబైలోని 60 ఆస్పత్రులకు , ఢిల్లీ, బెంగళూరులలోని వందలాది స్కూళ్లకు కూడా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.