Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్
Congress : హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. హర్యానాలో క్షేత్రస్దాయి పరిస్ధితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారు మారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమే అని విమర్శించారు.
- By Latha Suma Published Date - 07:22 PM, Tue - 8 October 24

Haryana assembly elections Counting : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల కల్లా కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో సీట్లతో ఆధిక్యంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే గంటలోపే పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. 10 గంటల కల్లా బీజేపీ అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చేయడం, ఆ తర్వాత తుది ఫలితాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడం జరిగిపోయాయి.
Read Also: RK Roja : ఉప ముఖ్యమంత్రి గారూ…పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్
దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్ ఇవాళ స్పందించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని వారు తేల్చిచెప్పేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ప్రజల అభీష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు. మధ్యాహ్నం వరకూ తాను ఈసీతో టచ్ లో ఉంటూ మూడు జిల్లాల్లోని ఈవీఎంలపై ఫిర్యాదు చేసినట్లు జైరాం రమేశ్ తెలిపారు.
హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. హర్యానాలో క్షేత్రస్దాయి పరిస్ధితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారు మారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమే అని విమర్శించారు. ఉదయమే ఈసీ వెబ్ సైట్లో ఫలితాల సరళి అప్ డేట్ సరిగా జరగడం లేదంటూ జైరాం రమేశ్ ఫిర్యాదు చేసారు. దీనిపై ఈసీ కూడా కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతా రాహిత్యం అంటూ స్పందించింది.
మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా హర్యానా ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని, తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈవీఎంలలో తేడాల గురించి హిసార్, మహేంద్రగఢ్, పానిపట్ నుండి తమకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. తమ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు చేసారని, అయితే తాము ఈ ఫిర్యాదులన్నింటినీ ఈసీకి అందిస్తామని ప్రకటించారు.