First Bharat Gaurav Train: ఈ నెల18 నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు.. 8 రాత్రులు, 9 పగళ్లు పుణ్యక్షేత్రాల దర్శనం
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్‌ల్ జీఎం
- Author : Maheswara Rao Nadella
Date : 16-03-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు (Bharat Gaurav Train) ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్‌ల్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భారత్ గౌరవ్ రైలు (Bharat Gaurav Train) యాత్ర గురించి ఆయన వివరించారు. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడం, వాటి ప్రాముఖ్యత గురించి ప్రయాణిలకు చాటి చెప్పాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ రైలు ప్రయాణానికి పూరి- కాశీ- అయోధ్య పుణ్యక్షేత్ర యాత్రగా పేరు పెట్టినట్టు తెలిపారు. 18 నుంచి ప్రారంభంకానున్న ఈ రైలు ఈ నెల 26 వరకు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుందని చెప్పారు.
ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగటిపూటలు ఇది కొనసాగుతుందని తెలిపారు. పూరి, కోణార్క్, గయ, వారణాసి, ఆయోధ్య, ప్రయాగరాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల గుండా కొనసాగనున్నదని వివరించారు. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించే వీలు కలుగుతుందని తెలిపారు. ఇందులో మొత్తం 700 సీట్లు ఉండగా, వాటిలో స్లీపర్లు 460, థర్డ్ ఏసీ 192, ఏసీ 48 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
Also Read: Sri Rama Navami: రూ.116 చెల్లిస్తే చాలు.. మన ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు అందుకోవచ్చు