Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!
మహారాష్ట్ర – కర్ణాటక రాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదం (Border Issue) మరింత ముదిరింది.
- Author : Maheswara Rao Nadella
Date : 07-12-2022 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర (Maharashtra) – కర్ణాటక (Karnataka) రాష్ట్రాల మధ్య బెలగావి సరిహద్దు వివాదం (Border Issue) మరింత ముదిరింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దాంతో కర్ణాటక రాష్ట్రానికి మహారాష్ట్ర తన బస్సు సర్వీసులను నిలిపివేసింది. బెలగావి సరిహద్దులో మహారాష్ట్ర ట్రక్కులపై ఆందోళనకారులు రాళ్లు విసిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సరిహద్దు వివాదం (Border Issue) నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వాహనాలపై ఆందోళనకారులు దాడులకు తెగబడుతున్నారు. పూణేలోని ప్రైవేట్ బస్సు పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కర్ణాటక నంబర్ ప్లేట్‌లతో కూడిన బస్సులపై దాడి చేసిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూణె నగరంలోని స్వర్గేట్ ప్రాంతంలో శివసేన కార్యకర్తలు ప్రైవేట్ బస్టాండ్‌లోకి చొరబడి కనీసం మూడు కర్ణాటక రాష్ట్ర బస్సులపై నలుపు, నారింజ రంగులను చల్లారు. ఈ బస్సు పార్కింగ్ యజమాని శివసేన (ఉద్ధవ్ క్యాంపు) నగర నాయకుడు కావడం గమనార్హం. అదే రోజు సరిహద్దు జిల్లా బెలగావిలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న లారీపై కన్నడ అనుకూల కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు సమస్య 1957 నాటి నుంచి కొనసాగుతోంది. మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి సరిహద్దు జిల్లాను మహారాష్ట్ర కోరుతుండగా, సరిహద్దుల ప్రకారం అది తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదన.
Also Read: Sharukh Khan: ఆర్యన్ ఖాన్ తెరంగేట్రానికి రంగం సిద్దం..!