యూజీసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
యూజీసీ 2026లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనల లక్ష్యం సమానత్వాన్ని నిర్ధారించడమే అయినప్పటికీ పిటిషనర్లు మాత్రం దీనికి విరుద్ధంగా వాదిస్తున్నారు.
- Author : Gopichand
Date : 29-01-2026 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
Supreme Court: సుప్రీంకోర్టు ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించే ‘సమానత్వ ప్రోత్సాహక నియమావళి- 2026’ పై తదుపరి ఆదేశాల వరకు స్టే విధించింది. ప్రస్తుతం 2012 నాటి పాత నిబంధనలే అమలులో ఉంటాయి. యూజీసీ రూపొందించిన ఈ కొత్త నిబంధనలు సాధారణ వర్గపు విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ రిట్ పిటిషన్లపై విచారణ చేపట్టింది. కొత్త నిబంధనల వల్ల వివక్ష పెరుగుతుందని పిటిషనర్లు వాదించగా, కోర్టు కూడా ఈ అంశంతో ఏకీభవించింది.
సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ఘాటుగా స్పందిస్తూ “మనం తిరోగమన దిశలో వెళ్తున్నామా? మనం కులరహిత సమాజం వైపు సాగాలి. ఎవరికైతే రక్షణ అవసరమో వారికి సరైన వ్యవస్థ ఉండాలి” అని పేర్కొంది.
మరికొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు
దుర్వినియోగం అయ్యే అవకాశం
“ఈ నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అమెరికాలో గతంలో శ్వేతజాతీయులకు విడిగా పాఠశాలలు ఉన్నట్లుగా, మన పాఠశాలలను విభజించే పరిస్థితికి మనం వెళ్లకూడదు. భారతదేశంలోని విద్యా సంస్థలు ఐక్యతను చాటాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, సమాధానం ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ మార్చి 19న జరగనుంది.
రిజర్వేషన్ల లోపల వర్గీకరణ
సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానిస్తూ.. రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలలో కూడా కొందరు ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకున్నారని శాసనసభ కూడా గుర్తించిందని అన్నారు. “రిజర్వ్డ్ కేటగిరీలలో కూడా కొన్ని వర్గాలు ఇతరులకన్నా మెరుగైన సౌకర్యాలను అనుభవిస్తున్నాయి. దీనిని విధాన రూపకర్తలు ఎలా చూస్తారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని అన్నారు.
Also Read: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!
ఒక పక్షానికే రక్షణనా?
విచారణ సందర్భంగా సీజేఐ ఒక ఉదాహరణ ఇస్తూ.. “ఒకవేళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి, ఇతర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిపై దూషణలకు దిగితే దానికి పరిష్కారం ఉందా?” అని ప్రశ్నించారు. ఈ నిబంధనలు కేవలం ఒక పక్షానికే రక్షణ కల్పిస్తున్నాయా లేదా నిజంగా న్యాయమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయా అనే కోణంలో ఆయన ఈ ప్రశ్న వేశారు.
ప్రత్యేక హాస్టళ్లు వద్దు – సీజేఐ
క్యాంపస్లలో విద్యార్థులను కులం ఆధారంగా విభజించే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమని కోర్టు హెచ్చరించింది. సీజేఐ స్పష్టమైన పదజాలంతో.. “మీరు విడిగా హాస్టళ్లు నిర్మించడం గురించి మాట్లాడుతున్నారు. అలా అస్సలు చేయకండి. కులరహిత సమాజం దిశగా మనం సాధించిన పురోగతి నుండి వెనక్కి వెళ్తున్నామా?” అని ప్రశ్నించారు. అలాగే ర్యాగింగ్ అనేది విద్యా సంస్థల వాతావరణాన్ని విషతుల్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పిటిషనర్ల వాదన
యూజీసీ 2026లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనల లక్ష్యం సమానత్వాన్ని నిర్ధారించడమే అయినప్పటికీ పిటిషనర్లు మాత్రం దీనికి విరుద్ధంగా వాదిస్తున్నారు. అడ్వకేట్లు మృత్యుంజయ్ తివారీ, వినీత్ జిందాల్, రాహుల్ దివాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్లలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
- ఈ నిబంధనలు సమానత్వం పేరుతో సాధారణ కేటగిరీ అభ్యర్థుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి.
- కొత్త నియమాలు రాజ్యాంగబద్ధమైన మెరిట్, సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయి.
- ప్రస్తుత నియమావళి అందరినీ కలుపుకొని పోయేలా కాకుండా, ఒక నిర్దిష్ట వర్గానికి అనుకూలంగా ఉంది. దీనివల్ల సాధారణ వర్గపు అవకాశాలు పరిమితం అవుతాయి.