Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 18-04-2025 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. విద్యావ్యవస్థలో నేటికీ బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని, మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Subrahmanya Swamy : గోవుల మరణం వెనుక కుట్ర ఉంది : సుబ్రహ్మణ్యస్వామి
కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ అన్నారు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య కృషి చేస్తారని తాను నమ్ముతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. కాగా, 2016 జనవరి 17న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. అతడు ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదేళ్ల తర్వాత మృతుడి తల్లి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై పునర్విచారణ ప్రారంభించింది. విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.