Hafiz Saeed : పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్.. హఫీజ్ సయీద్ ఇంటి సీక్రెట్స్
జోరమ్ తౌమ్ ఏరియాలోనే సామాన్య ప్రజల ఇళ్ల నడుమ ఓ భవనంలో హఫీజ్ సయీద్(Hafiz Saeed) నివసిస్తున్నాడు.
- By Pasha Published Date - 03:02 PM, Wed - 30 April 25

Hafiz Saeed : జమ్మూ కశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్. ఇతగాడు పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తైబా అనే ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు. లష్కరే తైబాకు అనుబంధంగా జమ్మూ కశ్మీరులో పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ ఉగ్రవాదులే ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్తానీలే. ఒక్కడు మాత్రమే కశ్మీరీ. తాను పెంచి పోషించే ఉగ్రవాదులతో దాడులు చేయించి ఎంతోమంది భారతీయుల ప్రాణాలు తీయిస్తున్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో హ్యాపీగా బతుకుతున్నాడు. పైగా ఆ ముష్కరుడి ఇంటికి పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు. ఈవిషయం తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోతో తేటతెల్లమైంది. అంటే హఫీజ్ సయీద్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వమే అని మరోసారి బహిర్గతమైంది. అయినప్పటికీ పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ సర్కారు బుకాయిస్తుండటం అత్యంత నీచం.
Also Read :NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్ జోషి.. ఎవరు ?
హఫీజ్ సయీద్ ఇంటి గురించి..
- లాహోర్ నగరంలో జోరమ్ తౌమ్ అనే ఏరియా ఉంటుంది. ఇది అత్యంత రద్దీ ప్రాంతం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.
- జోరమ్ తౌమ్ ఏరియాలోనే సామాన్య ప్రజల ఇళ్ల నడుమ ఓ భవనంలో హఫీజ్ సయీద్(Hafiz Saeed) నివసిస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా అదే ఇంట్లో ఉన్నారని సమాచారం.
- హఫీజ్ సయీద్ ఇంటి వద్ద నిత్యం పాక్ ఆర్మీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని దాటి.. అతడి ఇంట్లోకి ప్రవేశించడం చాలా కష్టం. అక్కడికి వెళ్లే వారికి ఆర్మీ, పోలీసు సిబ్బంది నానా ప్రశ్నలు వేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తుంటారు. అనుమానం వస్తే ఫొటో తీసుకుంటారు.
- హఫీజ్ సయీద్ ఇంటి ఎదుట ఒక ప్రైవేటు పార్క్ ఉంది. ఆ పక్కనే మసీదు, మదర్సా ఉన్నాయి.
- హఫీజ్ సయీద్ భవనం కింద ఓ రహస్య బంకర్ ఉంది. ఆ బంకర్ నుంచి లాహోర్ నగర శివార్ల వరకు సొరంగ మార్గాన్ని నిర్మించుకున్నారని అంటున్నారు.
Also Read :IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్‌ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా..
హఫీజ్ సయీద్‌ను సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. ఈవిషయం తెలిసినా పాకిస్తాన్ ప్రభుత్వం అతడికి సెక్యూరిటీ కల్పిస్తోంది. కంటికి రెప్పలా కాపాడుతోంది. అయినా పాకిస్తాన్‌పై ఐక్యరాజ్య సమితి కానీ, అమెరికా కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పేరుకే జైలు శిక్ష.. ఉండేది లాహోర్‌లోనే..
2008 నవంబరు 26న భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ కూడా హఫీజ్ సయీదే. లష్కరే తైబా ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చిన కేసులో అతడికి పాకిస్తాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో హఫీజ్ అరెస్టయినట్లు కథనాలు వచ్చాయి. నాటి నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. వాస్తవానికి జైలులో అతడికి బదులు.. అవే పోలికలున్న మరో వ్యక్తిని ఉంచినట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ మాత్రం స్వేచ్ఛగా లాహోర్‌లో జీవిస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అతడికి పాకిస్తాన్ ఆర్మీ సెక్యూరిటీని పెంచింది.