Constitution Debate : రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి : రాజ్‌నాథ్ సింగ్
దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు.
- By Latha Suma Published Date - 01:41 PM, Fri - 13 December 24

Constitution Debate : భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మిగతా పార్టీల నేతలు ఈ చర్చలో భాగం కానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం లోక్‌సభలో జీరో అవర్ ముగిసిన తరువాత రాజ్యాంగంపై చర్చ ప్రారంభమైంది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. సమాఖ్య వ్యవస్థను రాజ్యాంగం పటిష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపును అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాగా, శనివారం వరకూ ఈ చర్చ కొనసాగుతుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక చర్చకు ముగింపుగా రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.
కాగా, ప్రతిపక్షాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజ్యాంగంపై డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్ సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించింది. నవంబర్ 26, 1949 న, భారత రాజ్యాంగ సభ అధికారికంగా రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించింది. 2015లో, భారత ప్రభుత్వం 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గౌరవసూచకంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా (సంవిధాన్ దివస్) అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి, దేశం ప్రతి సంవత్సరం ఈ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని జరుపుకుంటుంది.