Delhi Politics On Fire: ఢిల్లీ పాలిటిక్స్ లో పుష్ప వార్? తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్… రప్పా రప్పా అంటూ బీజేపీ!
'పుష్ప 2' సినిమా స్టిల్స్‌తో ఆమ్‌ఆద్మీ పార్టీ మరియు భాజపా మధ్య దిల్లీలో పోస్టర్ వార్ కొనసాగుతోంది.
- By Kode Mohan Sai Published Date - 04:21 PM, Tue - 10 December 24

Delhi Politics On Fire: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ సినిమా స్టిల్స్‌తో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య పోస్టర్ వార్ (Poster War) మొదలైంది. ‘‘తగ్గేదేలే’’ అంటూ కేజ్రీవాల్ ఫొటోతో కూడిన ఓ పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది, దీనికి భాజపా కూడా ‘‘రప్పా-రప్పా’’ పేరుతో దీటుగా స్పందించింది.
ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేయడం ప్రారంభించాయి. సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు పరస్పరం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమ్‌ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌ను ‘‘జ్యూక్కేగా నహి (తగ్గేదేలే)’’ అన్న నినాదంతో ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇందులో పుష్ప సినిమాకి సంబంధించిన హీరో పోజులో కేజ్రీవాల్ చీపురు పట్టుకొని ఉన్నట్లు చూపించారు. నాలుగోసారి అధికారం తమదే అని తేల్చేలా ఆ పోస్టర్ రూపొందింది.
फिर आ रहा है केजरीवाल…💯 pic.twitter.com/S6Jo48rEJz
— AAP (@AamAadmiParty) December 7, 2024
ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP)కి దీటుగా స్పందించిన భారతీయ జనతా పార్టీ (BJP) కూడా తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ పుష్ప సినిమాలోని క్యారెక్టర్ తరహాలో కుర్చీలో కూర్చుని కనిపించేలా ఆ పోస్టర్‌ను రూపొందించారు. ‘‘అవినీతిపరులను అంతం చేస్తామని’’ అన్న సందేశంతో ‘‘రప్పా-రప్పా’’ అని రాసి ఉన్న ఈ పోస్టర్‌ను కాషాయ పార్టీ విడుదల చేయడంతో దిల్లీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
भ्रष्टाचारियों को खत्म करेंगे रप्पा-रप्पा! pic.twitter.com/3waGUaVFwl
— BJP Delhi (@BJP4Delhi) December 9, 2024
కొన్నేళ్లుగా దేశ రాజధానిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ వరుసగా 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈసారి కూడా ఆ పార్టీ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యంగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, 1998 నుంచి దిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈసారి ఢిల్లీలో విజయం సాధించేందుకు వ్యూహాలను రూపొందిస్తుంది.