Swadeshi Movement : దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహమే మార్గం: ప్రధాని మోడీ
దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు.
- By Latha Suma Published Date - 10:16 AM, Mon - 25 August 25

Swadeshi Movement : దేశ భవిష్యత్తు బలోపేతానికి స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యత అధికమని, ప్రతి భారతీయుడు ఈ నూతన స్వదేశీ ఉద్యమానికి భాగస్వామిగా మారాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ ఫేజ్-2 కన్యా ఛాత్రాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ఆయన, దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు. ప్రతి దుకాణదారుడు “కేవలం స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అమ్ముతాం” అనే బోర్డును ఏర్పాటు చేయాలని సూచించిన మోడీ, ప్రతి కుటుంబం దేశీయంగా తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు
సత్యబుద్ధితో, శుద్ధ ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నాలకు దేవుడి దీవెన కూడా లభిస్తుంది అని ప్రధాని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మోడీ మహిళల సాధికారత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్తగా నిర్మించనున్న బాలికల హాస్టల్‌లో 3,000 మంది విద్యార్థినులకు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఇది బాలికలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విద్య ద్వారా వారు జీవితంలో పురోగమించగలుగుతారు అని మోడీ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌నే కేంద్రంగా తీసుకుని వడోదర, సూరత్, రాజ్‌కోట్, మెహసానా వంటి నగరాల్లో కూడా ఇలాంటి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ‘కన్యాశిక్షా రథయాత్ర’ కార్యక్రమం, ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ఉద్యమానికి ప్రేరణగా మారిందని గుర్తు చేశారు. “బాలికల విద్యలో పెట్టిన ప్రతి రూపాయి, దేశాభివృద్ధికి పెట్టుబడిగా మారుతుంది,” అని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
‘లఖ్‌పతి దీదీ’, ‘డ్రోన్ దీదీ’, ‘బ్యాంక్ సఖి’ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల శక్తీకరణకు మార్గసూచిగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవి మహిళలను కేవలం ఉపాధి కల్పించడంలోనే కాదు, నాయకత్వ స్థాయికి చేర్చడంలో కూడా దోహదపడుతున్నాయి అని వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత పెరిగిందని, ఈ మార్పుల ఫలితంగా భారత నైపుణ్య జనశక్తికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోతోందని మోడీ పేర్కొన్నారు. సౌరశక్తి, రక్షణ, డ్రోన్లు, స్టార్టప్ రంగాల్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. తాజాగా ప్రవేశపెట్టిన రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన గురించి వివరించిన మోడీ, ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Read Also: BCCI: డ్రీమ్ 11తో స్పాన్సర్‌షిప్ డీల్ రద్దు.. బీసీసీఐకి నష్టం తప్పదా?