Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్‌ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
- By Latha Suma Published Date - 11:24 AM, Mon - 28 July 25

Chidambaram : దేశ భద్రత, పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై పార్లమెంటులో వాడీవేడిగా చర్చకు వేదిక సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ఉభయ సభలలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగనుంది. దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్‌ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది. పాక్ నుంచి వచ్చారని కేంద్రం చెబుతోంది కానీ, దేశీయ మూలాలు ఉన్నాయన్న అనుమానాలు విస్తరిస్తున్నాయి. ఆధారాలు ఏం ఉన్నాయి? అని ప్రశ్నించారు.
ఇంతటితో ఆగకుండా, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం ఎదుర్కొన్న నష్టం విషయంలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రధాని మోడీ బహిరంగ సభలలో ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నప్పటికీ, పార్లమెంట్‌లో మాత్రం ఈ విషయంపై మాట్లాడడం లేదని చిదంబరం విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటగా కాల్పుల విరమణ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, భారత్-పాక్ నైపథ్యంలో కేంద్రంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసిన వేళ, బీజేపీ నేతలు ఆగ్రహంతో స్పందించారు. పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ పాకిస్థాన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి సారి భారత భద్రతా దళాలు ఉగ్రవాదులకు గట్టి బదులు ఇస్తే, కాంగ్రెస్ నేతలు భారత ప్రతినిధిలా కాకుండా ఇస్లామాబాద్‌కు న్యాయవాదుల్లా ప్రవర్తిస్తున్నారు అని మండిపడ్డారు.
మరిన్ని పదులు కలుపుతూ దేశ భద్రతపై కేంద్రం స్పష్టంగా వ్యవహరిస్తోంది. కాని, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ శత్రు శక్తులను సమర్థించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇది సిగ్గుచేటు అని ఘాటుగా స్పందించారు. ఇంతటితో ఆగకుండా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ‘ఆపరేషన్ సిందూర్’పై ఆసక్తికర పోస్టు షేర్ చేశారు. పార్లమెంట్‌లో చర్చ ప్రారంభమయ్యే ముందు సత్యం వెలుగు చూస్తుంది. ప్రతిపక్షాలు ఎంతలా దాచేందుకు ప్రయత్నించినా, వాస్తవాలు దాచలేవు అంటూ ఆయన సూచనాత్మకంగా వ్యాఖ్యానించారు. ఈ వాదనల నేపథ్యంలో సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలే అవకాశం కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ వెనుక గల నిజాలు, పాక్ ప్రమేయంపై స్పష్టత ఈ చర్చల ద్వారా రానుందా? లేక రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
Read Also: Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు