Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.
- By Pasha Published Date - 04:45 PM, Mon - 12 May 25

Operation Sindoor : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మే 10న మధ్యాహ్నం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనుండటం ఇదే తొలిసారి. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు అండగా నిలిచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) ముమ్మాటికీ భారత్‌దే.. పాక్ ఉగ్రవాదులకు భారత్‌కు అప్పగించాల్సిందే అనే అంశాలతో ప్రధాని మోడీ ప్రసంగం సాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించేది లేదని మోడీ తేల్చి చెప్పే ఛాన్స్ ఉంది.
మే 7 నుంచి ఏమేం జరిగాయి ?
- మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.
- అప్పటి నుంచి మే 10న మధ్యాహ్నం వరకు భారత్, పాక్ సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. పరస్పర దాడులు జరిగాయి.
- శుక్రవారం (మే 9) రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారత్, పాకిస్తాన్‌లతో అమెరికా జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఇరుదేశాల ప్రభుత్వాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల స్థాయిలో చర్చలకు అంగీకారం తెలిపాయి.
- దీంతో శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ అపాయింట్‌మెంట్‌ను పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా కోరారు. దీనికి భారత డీజీఎంఓ వెంటనే ఓకే చెప్పారు. పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చలు జరిపారు.
- ఈ చర్చల వేళ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనల వివరాలను భారత రక్షణశాఖకు డీజీఎంఓ రాజీవ్ ఘయ్ తెలిపారు. భారత రక్షణ శాఖ నుంచి ఈ సమాచారం భారత ప్రధాని మోడీ దాకా చేరింది. పాకిస్తాన్‌తో తక్షణ కాల్పుల విరమణకు భారత సర్కారు అంగీకారాన్ని తెలిపింది.
- అనంతరం ఇదే సమాచారాన్ని పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ చేరవేశారు.
- ఈవిధంగా మే 10న సాయంత్రం 5 గంటల నుంచి తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ సమయం తర్వాత పాకిస్తాన్ సైన్యం పలుచోట్ల కాల్పులకు పాల్పడింది. తమ డ్రోన్లను భారత గగనతలం వైపుగా పంపింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- ఇక పాకిస్తాన్ ప్రతీ బుల్లెట్‌కు మిస్సైల్‌తో బలంగా జవాబు చెప్పాలని భారత సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని బలంగా ప్రతిఘటించేందుకు సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఫుల్ పవర్స్ కేటాయించారు. ఈ విషయం తెలియడంతో ఆదివారం రాత్రి సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ చడీచప్పుడు లేకుండా గడిపింది.
- ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ చేయనున్న ప్రసంగం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.