Encounter : ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్‌కౌంటర్..!
Encounter: స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు.
- Author : Latha Suma
Date : 24-09-2024 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
Ghazipur Encounter: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ఇటీవల ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు. జాహిద్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు ఘాజీపుర్ జిల్లా ఆస్పత్రిపై వైద్యులు ప్రకటించారు.
Read Also: PM Modi Meets Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడిని మరోసారి కలిసిన ప్రధాని మోదీ!
ఆగస్టు 20న అర్ధరాత్రి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్‌లు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మద్యం స్మగ్లర్లు ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. ఆపై కదులుతున్న రైలు నుంచి వారిని తోసేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. అప్పటి నుంచి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ మద్యం స్మగ్లర్.. మరోసారి మద్యంను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సోమవారం రాత్రి సమాచారం అందింది.
Read Also: Pawan Kalyan : లడ్డూ వివాదం.. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్
యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోయిడా యూనిట్, స్థానిక ఘాజీపుర్ పోలీసు బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మహ్మద్ జాహిద్ గాయపడ్డాడు. పోలీసు సిబ్బందిలో కొందరికి కూడా గాయాలయ్యాయి. అందరినీ ఘాజీపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిందితుడు జాహిద్ మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. ఇటీవలి రోజుల్లో యూపీలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.