Mumbai Blasts : ఉగ్రవాది తహవూర్‌కు షాక్.. భారత్‌కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు
పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాదిని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది.
- By Pasha Published Date - 12:55 PM, Sat - 17 August 24

Mumbai Blasts : 2008 సంవత్సరం నవంబరు 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడి ఘటన యావత్ ప్రపంచంలో కలకలం రేపింది. ఆ దాడి కేసులో(Mumbai Blasts) కీలక నిందితుడు తహవూర్ రాణా. పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాదిని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది. ఈక్రమంలో ఓ ఆశాజనక పరిణామం చోటుచేసుకుంది. అతడిని భారత్‌కు అప్పగించవచ్చని పేర్కొంటూ అమెరికా కోర్టు తాజాగా ఓ తీర్పును వెలువరించింది. దీంతో తహవూర్ రాణాను ఇండియాకు తీసుకు రావాలనే భారత ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత బలం లభించినట్లు అయింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
పాకిస్తాన్‌కు చెందిన తహవూర్ రాణా కెనడాలో ఉంటూ వ్యాపారాలు చేసేవాడు. అమెరికాలోనూ తహవూర్ రాణా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కొందరు ఉగ్రవాదులకు సహాయ సహకారాలను అందించాడు. ఈవిషయం తెలియడంతో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో షికాగో కోర్టులో ప్రవేశపెట్టగా 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. అతడు ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో శిక్షను అనుభవిస్తున్నాడు.
Also Read :Paramilitary Attack : పారామిలిటరీ రాక్షసత్వం.. దాడిలో 80 మంది సామాన్యులు మృతి
భారత్-అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. దీనిప్రకారం అతడిని తమకు అప్పగించాలంటూ గతేడాది కాలిఫోర్నియా జిల్లా కోర్టులో భారత్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు భారత్ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా స్పందించింది. తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కాలిఫోర్నియా జిల్లా కోర్టులోనే రైటాఫ్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను తహవూర్ దాఖలు చేశాడు.ఈ ఆదేశాల వల్ల అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని వాదించాడు. అయితే ఎట్టకేలకు ఆ అప్పీల్‌ను ఇప్పుడు కోర్టు తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. భారత్-అమెరికా మధ్యనున్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగానే తాము గతంలో ఆదేశాలు ఇచ్చామని కోర్టు స్పష్టం చేసింది. తహవూర్‌పై మోపిన అన్ని అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను భారత్ ఇప్పటికే తమకు సమర్పించిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపైనా మరోసారి తహవూర్ రాణా ఎగువ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.