LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
- By Vamsi Chowdary Korata Published Date - 01:38 PM, Mon - 17 November 25
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దాం.
కొంత కాలంగా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తొలుత 25 శాతానికి తర్వాత రెట్టింపు చేసి 50 శాతానికి పెంచింది. ఇదే సమయంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో.. భారత్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని క్రమక్రమంగా తగ్గిస్తూ.. అమెరికా నుంచి పెంచుకుంటోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా.. కీలక ముందడుగు వేసింది. అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ను (LPG) దిగుమతి చేసుకునే దిశగా చారిత్రక ఒప్పందం కుదిరిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు.
భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. అమెరికాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనిని సోషల్ మీడియాలో (x) పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లలో భారత్ ఒకటి అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయ వినియోగదారులకు అందుబాటు ధరల్లో వంట గ్యాస్‌ను అందించే ప్రయత్నంలో భాగంగానే ఈ డీల్ చేసుకున్నట్లు తెలిపారు.
A historic first!
One of the largest and the world’s fastest growing LPG market opens up to the United States.
In our endeavour to provide secure affordable supplies of LPG to the people of India, we have been diversifying our LPG sourcing.
In a significant development,…
— Hardeep Singh Puri (@HardeepSPuri) November 17, 2025
అమెరికా- భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. భారత్ ఏడాదికి సుమారు 2.2 మిలియన్ టన్నుల (MTPA) ఎల్పీజీని దిగుమతి చేసుకోనుంది. ఇది భారత్ ఏటా చేసుకునే ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10 శాతంగా ఉంది. సంవత్సరం పాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. ఈ ఎల్పీజీ అమెరికాలోని యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి రానుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల బృందాలు ఈ డీల్‌ను ఖరారు చేశాయి.
తేడాది అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతానికిపైగా పెరిగినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌ను రూ. 500-550 చొప్పున అందించేందుకు కట్టుబడి ఉందని పురీ తెలిపారు. వాస్తవ ధర రూ. 1100 కుపైనే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ధరల పెరుగుదల భారం భారత వినియోగదారులపై పడకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఏడాదిలో అదనంగా రూ. 40 వేల కోట్లకుపైగా భారాన్ని భరించిందని వివరించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర (14.2 కిలోలు) రూ. 905 గా ఉంది. ఇది ఢిల్లీలో రూ. 853 గా ఉంది. బెంగళూరులో రూ. 855.50 గా ఉంది.