Lebanon Pager Blasts : లెబనాన్‌లో పేజర్లు పేలిన కేసులో కేరళవాసి పేరు.. ఏం చేశాడంటే.. ?
ఈ పేజర్లు రిన్సన్ జోస్‌కు(Lebanon Pager Blasts) చెందిన కంపెనీ నుంచి హిజ్బుల్లాకు సప్లై అయినప్పటికీ.. వాటిపై తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో లోగో ఉంది.
- Author : Pasha
Date : 21-09-2024 - 3:26 IST
Published By : Hashtagu Telugu Desk
Lebanon Pager Blasts : ఇటీవలే ఇజ్రాయెల్ పొరుగుదేశం లెబనాన్‌లో పేజర్లు పేలిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. వందలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ఈ ఘటనలపై జరిగిన దర్యాప్తులో ఓ కేరళ వాస్తవ్యుడి పేరు తెరపైకి వచ్చింది. అతడి పేరు రిన్సన్ జోస్. వయసు 37 ఏళ్లు. ఇతగాడు కేరళలోని వయనాడ్ నుంచి నార్వేకు వలస వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. అయితే రిన్సన్ జోస్ బల్గేరియా కేంద్రంగా ఒక కంపెనీని నడుపుతున్నాడు. ఆ కంపెనీ పలు మిలిటెంట్ గ్రూపులకు పేజర్లను సప్లై చేస్తోంది.
Also Read :Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
ఈ కంపెనీ సప్లై చేసిన పేజర్లను తొలుత మోసాద్ ఏజెంట్లు మోడిఫై చేశారని దర్యాప్తులో గుర్తించారు. ఆయా పేజర్లను తెరిచి, వాటిలోకి 3 గ్రాముల పేలుడు పదార్థాలను చొప్పించారు. ఈ పేజర్లు రిన్సన్ జోస్‌కు(Lebanon Pager Blasts) చెందిన కంపెనీ నుంచి హిజ్బుల్లాకు సప్లై అయినప్పటికీ.. వాటిపై తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో లోగో ఉంది. వాస్తవానికి ఈ పేజర్లను హంగరీలోని బుడాపెస్ట్ నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ అనే కంపెనీ తయారు చేసింది. బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ వద్ద గోల్డ్ అపోలో లోగో, ట్రేడ్ మార్క్‌లను వాడుకునేందుకు సంబంధించిన కమర్షియల్ అనుమతులు ఉన్నాయి. అందుకే వాటిపై ఆ లోగోను వాడారు. లెబనాన్‌లో పేలుళ్లు సంభవించిన పేజర్లతో తమకు సంబంధం లేదని గోల్డ్ అపోలో కంపెనీ తేల్చి చెబుతోంది.
Also Read :Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఈనేపథ్యంలో ఆయా పేజర్లలోకి పేలుడు సామగ్రి ఎలా చేరింది ? అనే అంశంపై బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్‌టీ కంపెనీ వర్గాలను బల్గేరియా జాతీయ భద్రతా సంస్థ ‘డీఏఎన్ఎస్’ విచారిస్తోంది. ఈక్రమంలోనే రిన్సన్ జోస్ పేరును గుర్తించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో నోర్టా గ్లోబల్ పేరుతో ఒక కంపెనీని అతడు 2022 సంవత్సరంలో రిజిస్టర్ చేయించాడని తేలింది. ఈ కంపెనీ కన్సల్టెన్సీ సేవలను అందించేదని వెల్లడైంది. ‘‘ఓస్లోలోనే రిన్సన్ జోస్ భార్యతో పాటు ఉండేవాడు. లెబనాన్‌లో పేజర్లు పేలినప్పటి నుంచి అతడికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. జోస్ భార్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. జోస్ కచ్చితంగా తప్పుడు పనులు చేయడు’’ అని వారి బంధువు ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.