Loksabha : జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..లోక్‌సభ నిరవధిక వాయిదా
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు.
- By Latha Suma Published Date - 12:37 PM, Fri - 20 December 24

Loksabha : ఈరోజు నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ సభలో ఉన్నారు.
మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు. ఇక, జేపీసీ కమిటీలో 27మంది లోక్‌సభ, 12 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ బిల్లును తిరిగి లోక్‌సభ స్పీకర్‌కు పంపుతుంది. ఇక ఈ జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ బిర్లా.. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను కోరారు. మరో వైపు సభలో విపక్షాలు జైభీం అంటూ కేకలు పెట్టారు. పార్లమెంట్ గేటు వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదు అని స్పీకర్ బిర్లా ఆదేశించారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు.
ఇక ఈరోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద .. ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి నేతలు తప్పుపట్టారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలని నేడు విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి లోక్‌సభ రిఫర్ చేసింది. మరో వైపు విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.