Bachchala Malli Movie Review & Rating: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమా ఎలా ఉందంటే?
- By Kode Mohan Sai Published Date - 12:28 PM, Fri - 20 December 24

Bachchala Malli Movie Review & Rating: అల్లరి నరేష్ అనగానే కొన్నాళ్ల క్రితం చాలా మందికి కామెడీ చిత్రాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అతను తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, వివిధ రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. “నాంది” చిత్రంతో మంచి విజయం సాధించిన అనంతరం, ఇంకా కొత్త, డిఫరెంట్ పాత్రలను సాఫీగా అందిస్తున్నాడు. “నా సామిరంగా” లో అతని అభినయానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపించారు. ఇక, ఇప్పుడు “బచ్చల మల్లి” చిత్రంలో అతను పూర్తిగా కొత్తగా కనిపించిపోతున్నాడు. ఈ కొత్త పాత్రతో అతను మరలా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడా? లేక, కాస్త వెనక్కి పడ్డాడా? అది తెలియాలంటే, ఆ చిత్రం ఒకసారి చూసే సరే!
కదా:
బచ్చల మల్లి (Allari Naresh) చిన్నప్పటి నుంచీ బాగా చురుకైనవాడు. తండ్రి గర్వపడేలా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో ప్రేమకలవాడు . కానీ, ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసుని పూర్తిగా గాయపరుస్తుంది. ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, వ్యసనాలు, సావాసాలకి దారి తీస్తుంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతుంటాడు. మద్యం తాగుతూ, నిత్యం ఊళ్లో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి (Amritha Aiyer) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మల్లి తీసుకున్న నిర్ణయాలేమిటి?మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా? లేదా? (Bachhala Malli Movie Review) అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమకథ సుఖాంతమైందా? తదితర విషయాలు తెలియాలంటే బచ్చల మల్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
తన కోపమే తన శత్రువు అని అంటుంటారు.. మూర్ఖత్వంతో కళ్లు మూసుకుపోయిన వాడికి మంచేదో చెడేదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తరువాత, అందరినీ కోల్పోయిన తరువాత గానీ తత్త్వం బోధపడదు. ఇదే పాయింట్‌ను బచ్చల మల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదల్చుకున్నాడు. ఎవరినైనా సరే వదిలేసుకోవడం తేలికే.. కానీ బంధాన్ని నిలుపుకోవడమే కష్టం అని చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోగలం.. కొన్ని తప్పుల్ని మాత్రం సరిదిద్దుకునేందుకు వీలుండవు. అలాంటి తప్పుల్ని చేసి బచ్చల మల్లి తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని ఎలా నాశనం చేశాడు? అనేది చూపించాడు. జీవితం అన్నాక పట్టూ విడుపులు ఉండాలని రాసిన డైలాగ్ బాగుంటుంది. బచ్చల మల్లి కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా అలా సాగుతూ వెళ్తుంది. ఏ ఒక్క సీన్‌లోనూ కొత్తగా జరిగిందే.. కొత్తగా కనిపించిందే అనే సీన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియెన్స్ ఊహకు అందేలానే సాదాసీదాగా సాగుతుంది. అల్లరి నరేష్ పాత్రను మల్చిన తీరు, నటించిన తీరు మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. ఇక జాతర సీన్‌లో ఫైటింగ్, తారాజువ్వలు వచ్చే షాట్స్ మాత్రం అదిరిపోతాయి. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపించే సీన్లు ఉంటాయి. ఇందులో విలన్ పాత్ర అంతగా ప్రభావం చూపించదు. ఎందుకంటే మల్లి కోపం, మూర్ఖత్వమే అతనికి పెద్ద శత్రువు కాబట్టి. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా, ప్రేక్షకుడి ఊహకు అందనట్టుగా ఉంటుంది. బచ్చల మల్లి తన జీవితంలో కోపం, మూర్ఖత్వంలో చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ.. వాటిని ఒక వేళ అలా చేయకుండా ఉంటే.. జీవితం ఎంత అందంగా ఉండేదో తలుచుకునే సీన్‌తో దర్శకుడు చెప్పదల్చుకున్న సందేశాన్ని చెప్పేశాడు. కట్టలు తెంచుకునే కోపం, నియంత్రణ లేని కోపం, మూర్ఖత్వంతో ఏమీ సాధించలేమని మల్లి పాత్రతో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రాసెస్‌లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ కథను 1985, 1995, 2005 అంటూ విడగొట్టుకుని చెప్పిన తీరు, ఆ స్క్రీన్ ప్లే మాత్రం బాగుంటుంది.
సినిమాకి బలాలు (Positives):
- అల్లరి నరేష్ నటన
- కథ
- కొన్ని కొత్త మలుపులు
సినిమాకి బలహీనతలు (Negatives):
- అక్కడక్కడా రక్తి కట్టించని కధనం
- బలం లేని బావోద్వేగాలు
చివరిగా:
టెక్నికల్‌గా బచ్చలమల్లి నిరాశపర్చదు. ఇది ఒక పీరియాడిక్ మూవీ అన్నట్టుగానే ఉంటుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ సహజంగానే ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలోని పాటలు కొన్ని వినసొంపుగానే ఉంటాయి. ఆర్ఆర్ చాలా చోట్ల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసాను బచ్చల మల్లి తీసుకొచ్చేస్తాడా? లేదా అన్నదీ మున్ముందు తెలుస్తుంది.
HashtagU Review & Rating: 3/5
గమనిక: ఈ సమీక్షా, సమిక్షుకుడి యొక్క దృష్టి కొన్నాని బట్టి ఉంటుంది. ఇది పూర్తిగా సమీక్షకుడి యొక్క వ్యక్తిగత కోణం మాత్రమే.