India With Palestine : గాజాలో పిల్లలు, మహిళల మరణాలపై భారత్ కీలక వ్యాఖ్యలు
India With Palestine : పాలస్తీనాకు అండగా ఉంటామని భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది.
- By Pasha Published Date - 10:25 AM, Wed - 10 January 24

India With Palestine : పాలస్తీనాకు అండగా ఉంటామని భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల భయంకరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనా ప్రజలను ఆదుకునే విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ బుధవారం తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలోని పిల్లలు, మహిళలు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను భారత్ ఎప్పటికీ ఆమోదించదని తేల్చి చెప్పారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడి సైతం సరికాదని చెప్పారు. భారత్ ఉగ్రవాదాన్ని సహించబోదన్నారు. యుద్ధం ముగిసే వరకు పాలస్తీనాకు మానవతాసాయాన్ని అందించడం కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటివరకు భారత్ గాజాకు రెండు విడతలుగా 16.5 టన్నుల మందులు, వైద్య సామాగ్రి సహా 70 టన్నుల సాయం అందించిందని(India With Palestine) గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెల్ – గాజా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ తనవంతుగా ప్రయత్నాలు చేస్తోందని రుచిరా కాంబోజ్ తెలిపారు. దీనిపై భారత నాయకత్వం ఇజ్రాయెల్, పాలస్తీనా సహా ఆ ప్రాంత ముఖ్య నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి 2023 డిసెంబర్ నెలాఖరులో భారత్ రూ.62 కోట్ల సాయాన్ని అందించిందని ఆమె గుర్తు చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయిలీలు మరణించారు. నాటి నుంచి నేటివరకు గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. యావత్ ప్రపంచం ఒక్కటై ఎదురు నిలబడినా గాజాపై దాడులను ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ విజయం సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఆయన నొక్కి చెబుతున్నారు. హమాస్ నిర్వహిస్తున్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. యుద్ధంలో 23,210 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి.. హమాస్ కీలక నేతను హతమార్చింది. దీంతో ఇజ్రాయెలీ బందీల విడుదలపై జరుగుతున్న చర్చల నుంచి హమాస్ వైదొలగింది. మరోవైపు లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా వైపు నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు ముమ్మరం అయ్యాయి.