హైఅలర్ట్.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..
- Author : Vamsi Chowdary Korata
Date : 04-03-2026 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Jammu Kashmir సుదూర తీరాన ఉన్న ఇరాన్‌లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్‌ను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని.. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా అధికారులు నిలిపివేశారు.
Iran Israel War Schools Shut In Kashmir ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడని తెలిసినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో నిరసన జ్వాలలు ఆగడం లేదు. అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోయలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సకీనా ఇటూ అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
అట్టుడుకుతున్న లోయ.. రాళ్ల వర్షం
ఖమేనీ చనిపోయినట్లు ఆదివారం రోజు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు పోలీసులు సహా కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. పౌర జీవనానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదని, రాళ్లు రువ్వే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
దిగ్బంధంలో లాల్ చౌక్.. కట్ అయిన ఇంటర్నెట్
ఈక్రమంలోనే శ్రీనగర్ ప్రధాన కేంద్రమైన లాల్ చౌక్ గత మూడు రోజులుగా పోలీసుల దిగ్బంధంలోనే ఉంది. ఆదివారం ఇక్కడే వేలాది మంది నిరసనకారులు గుమిగూడటంతో.. ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రవేశ మార్గాలను టీన్ షీట్లు, ముళ్ల కంచెలతో మూసివేశారు. లోయలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. హోం శాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల తీవ్రతను బట్టి వీటిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.
అదుపులో ఉన్నా.. ఆందోళనగానే!
మంగళవారం నాడు పెద్దగా హింసాత్మక ఘటనలు నమోదు కాకపోయినప్పటికీ.. అంతర్లీనంగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విదేశీ పరిణామాల ప్రభావం కాశ్మీర్ లోయపై పడటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ స్థితి పునరుద్ధరించే వరకు విద్యాసంస్థలు తెరవడం శ్రేయస్కరం కాదని అధికారులు భావిస్తున్నారు.