GST Council : పండుగల సీజన్‌లో వినియోగదారులకు గిఫ్ట్.?
GST Council : దేశవ్యాప్తంగా పండగ వాతావరణం దగ్గరపడుతున్న ఈ సమయంలో, వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
- By Kavya Krishna Published Date - 04:59 PM, Wed - 3 September 25

GST Council : దేశవ్యాప్తంగా పండగ వాతావరణం దగ్గరపడుతున్న ఈ సమయంలో, వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు (బుధవారం) ఢిల్లీలో జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా ప్రకటించినట్లుగా, ఈసారి పన్ను విధానంలో “దీపావళి గిఫ్ట్” రూపంలో ఊరట ఇవ్వవచ్చన్న ఊహాగానాలు మార్కెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాయి.
నాలుగు శ్లాబులు కట్ – రెండు మాత్రమే మిగలనున్నాయా?
ప్రస్తుతం అమల్లో ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు స్థాయిల జీఎస్టీ పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో సరళతకు ప్రాధాన్యం ఇస్తూ కేవలం రెండు స్థాయిల (శ్లాబులు) విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనను ఈ సమావేశంలో చర్చించనున్నారు. వస్తువులు, సేవలను “మెరిట్” మరియు “స్టాండర్డ్” అనే రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించి, కొత్త రేట్లను అనుసరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ మార్పుల వల్ల పలు నిత్యావసర వస్తువులు చౌక అవుతాయని, వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కొన్నిపరిశ్రమలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు లగ్జరీ గూడ్స్ రంగం, ధరల పెరుగుదలతో ఎదురుదెబ్బ తినే అవకాశముంది.
చౌక కానున్న వస్తువులు – ప్రజలకు ఊరట తాజా ప్రతిపాదనల ప్రకారం:
వాహనాలు: 1200 సీసీ లోపు చిన్న కార్లు, 350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గే అవకాశం.
నిత్యావసరాలు: సబ్బులు, షాంపూలు, వంట నూనెలు వంటి వాటిపై 18% నుంచి 5% శ్లాబులోకి మారే అవకాశం.
ఆహార పదార్థాలు & హాస్పిటాలిటీ: పన్నీర్, ఐస్‌క్రీమ్, పండ్ల రసాలు, హోటల్ గదులు, సినిమా టికెట్లపై పన్ను తగ్గుతుందని అంచనా.
మెడికల్ ఫీల్డ్: క్యాన్సర్ మందులపై జీఎస్టీ పూర్తిగా మినహాయించే ప్రతిపాదనపై సీరియస్‌గా చర్చ జరుగుతోంది.
ఈ మార్పులు అమల్లోకి వస్తే, సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది.
ప్రియం కానున్న వస్తువులు – కొనుగోలుదారులపై భారం
అయితే అన్ని రంగాలకూ సర్దుబాటు జరగదు. కొన్ని వస్తువులపై పన్ను భారం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి వాటిలో..
ఎలక్ట్రిక్ వాహనాలు: రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ధర కలిగిన వాహనాలపై జీఎస్టీ 5% నుంచి 18%కి పెరిగే అవకాశం.
టెక్స్టైల్స్: రూ. 2,500 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులపై పన్ను పెరగవచ్చు.
లగ్జరీ గూడ్స్: పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, లగ్జరీ ఆటోమొబైల్స్ వంటి వాటిపై 40% “సిన్ ట్యాక్స్” విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
దీంతో మధ్యతరగతి వినియోగదారులు కొంత భారం మోయాల్సి రావచ్చు.
ప్రభుత్వానికి నష్టమా? లాభమా?
ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి తక్షణమే సుమారు రూ. 50,000 కోట్ల ఆదాయం తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరిగి, మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుందని, చివరికి ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు త్వరితగతిన అమలులోకి రానున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నట్లు సమాచారం.
Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది