Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
- By Latha Suma Published Date - 04:39 PM, Wed - 3 September 25

Hyderabad : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న జరగనున్న గణేశ్ మహా నిమజ్జనానికి పోలీసులు సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు. ముఖ్యంగా బాలాపూర్ నుండి ప్రారంభమయ్యే నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గాన్ని ఆయన స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ఊరేగింపు మార్గాల్లో ఎక్కడైనా చెట్లు లేదా విద్యుత్ తీగలు అడ్డంగా ఉండకుండా ముందుగానే తొలగించే చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అలాగే, రోడ్లపై గుంతలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
Read Also: Tomatoes : టమాటాలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?..మరి రోజుకు ఎన్నితినాలి..?
వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. సురక్షిత, శాంతియుత నిమజ్జన కార్యక్రమం జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నగరానికి చెందిన 20,000 మంది పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి అదనంగా 9,000 మంది సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. వీరితో పాటు కేంద్ర బలగాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను కూడా మోహరిస్తున్నారు. అదేవిధంగా, సెప్టెంబర్ 6న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు, సెప్టెంబర్ 14న మరో భారీ ర్యాలీ, మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా ఒకే సమయంలో ఉండటం వలన, భద్రతా ఏర్పాట్లపై మరింత నిఘా పెంచామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక క్రైమ్ టీమ్‌లు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని తెలిపారు. పౌరులు, భక్తులు శాంతియుత వాతావరణంలో పాల్గొని గణేశ్ నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఇక, నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని మండిపడింది. గత 45 ఏళ్లుగా ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతోందని, అదే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సమితి స్పష్టం చేసింది. భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సమితి, ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. సంప్రదాయాన్ని గౌరవించడంతో పాటు, భక్తుల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది.