General Elections : సార్వత్రిక ఎన్నికలు: మోడీ Vs షా
డిసెంబర్ కల్లా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తున్నారు.
- By Hashtag U Published Date - 11:10 AM, Tue - 29 August 23

By: డా. ప్రసాదమూర్తి
General Elections : డిసెంబర్ కల్లా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జయాపజయాలు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, బిజెపిని ఈసారి ఎలాగైనా కేంద్రంలో గద్దె దింపాలన్న దృఢ నిశ్చయంతో పావులు కదుపుతున్న ప్రతిపక్షాలకు అతి కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో బలాబలాల పట్ల పలువురు మేధావులు, పాత్రికేయులు విశ్లేషణలు కురిపిస్తున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మూడింట బిజెపి ఓడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా.
మణిపూర్ జాతుల విద్వేషం నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా మిజోరంలో బిజెపి గెలవలేదని, చత్తీస్ గఢ్ లో నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న బిజెపి అనివార్యంగా అపజయం పాలవుతుందని, తెలంగాణలో ప్రధాన పోటీ, కాంగ్రెస్.. బిఆర్ఎస్ మధ్యనే ఉంటుందని, కనుక ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనేది పలువరి అవగాహన. ఇక మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా బిజెపికి సానుకూల పవనాలు కనిపించడం లేదు.
ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే జరిగితే ఐదు రాష్ట్రాల్లో బిజెపి, సార్వత్రిక ఎన్నికలకు (General Elections) ముందుగానే పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇంతకుముందే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో పరాజయం పాలైన బిజెపికి, ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ఓటమి ఎదురైతే అది చావు దెబ్బే అవుతుంది.
అందుకే మోడీ కొత్త మంత్రాంగం రచిస్తున్నట్టు ఊహాగానాలు దేశమంతా ఊరేగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు (General Elections) కూడా ఈ ఐదు రాష్ట్రాలతో పాటే జరిపిస్తే సరిపోతుంది కదా, అప్పుడు రాష్ట్రాల్లో అపజయం, కేంద్రం మీద ప్రభావం చూపదని మోడీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మమతా బెనర్జీ తాజాగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇదే విషయాన్ని అంతకుముందు ఎన్సీపీ నేత శరద్ పవర్ అన్నారు. నితీష్ లాంటి ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఇదే ఊహాగానం చేస్తున్నారు. సో.. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు దేశం ముంగిట నిలబడ్డాయని అనుకోవచ్చు.
అంతేకాదు ఒకవైపు ప్రతిపక్షాలు దాదాపు అన్నీ చేతులు కలుపుతున్న విషయం కేంద్రంలో అధికార పార్టీకి భయం పుట్టిస్తుందని వ్యాఖ్యానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అందుకే మోదీ తప్పనిసరిగా అటు ప్రతిపక్షాల ఐక్యత బలపడటానికి సమయం ఇవ్వకుండా, ఇటు రాష్ట్రాల్లో ఎదురు కాబోయే పరాజయాన్ని సాగదీసి సార్వత్రిక ఎన్నికల (General Elections) పై ఆ ప్రభావాన్ని చవిచూసే రిస్కు తీసుకోకుండా, ముందే ఎన్నికలకు వెళ్లడం మంచిదని ఆలోచిస్తున్నట్టు పలు వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో అమిత్ షా ఆలోచనలు మరో రకంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈడి, ఐటి, సిబిఐ ఉండగా మనకెందుకు భయం అనేది అమిత్ షా భరోసా. ఈ మూడు సంస్థలకు మంచి సమయం ఇస్తే, సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రతిపక్షాల పని పడతాయని, అప్పుడు విపక్షాలు జవసత్వాలు ఉడిగి ఉంటాయని, ఇక అప్పుడు వాటిని చిటికెన వేలుతో కిందపడేయొచ్చని అమిత్ షా వ్యూహం.ఇదీ.. మోదీ, అమిత్ షాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ పాయింట్. ఏది ఏమైనా సెప్టెంబర్ 10న G 20 సమిట్ తర్వాత మోడీ ఈ విషయంలో ఒక క్లారిటీకి వస్తారని అందరూ భావిస్తున్నారు. చూడాలి, మోడీ నిర్ణయం ఎలా ఉంటుందో.
Also Read: NTR Coin – Buy Now : ‘ఎన్టీఆర్ కాయిన్’ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనేయండి