Warships : యుద్ధనౌకల విశేషాలు..
భారత్ ప్రపంచంలో బలమైనశక్తిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు.
- By Latha Suma Published Date - 12:15 PM, Wed - 15 January 25
 
                        Warships : మరో మూడు యుద్ధనౌకలు భారత వాయుసేన అమ్ములపొదిలోకి వచ్చి చేరాయి. అధునాతన ఐఎన్‌ఎస్ సూరత్ (INS Surat), ఐఎన్‌ఎస్ నీలగిరి (INS Nilgiri), ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ (INS Vaghsheer) యుద్ధనౌకలను ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ప్రధాని మోడీ వీటిని ప్రారంభించారు. అనంతరం మూడు నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నేవీ బలం పెరుగనుంది. ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. భారత్ ప్రపంచంలో బలమైనశక్తిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు. ఈ యుద్ధ నౌకలు భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు..
యుద్ధనౌకల విశేషాలు..
ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. దీనిని శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానున్నది.
ఐఎన్‌ఎస్ సూరత్.. ఇది పీ15B గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్దనౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్‌షిప్‌లలో ఒకటి. దీనిని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.
కాగా, నవీ ముంబయిలో ఇస్కాన్ ప్రాజెక్టు కింద శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. తొమ్మిది ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో చాలా దేవతలతో కూడిన ఆలయం, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియం, ఆడిటోరియం, చికిత్స కేంద్రం వంటివి ఉన్నాయి.