MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
- By Latha Suma Published Date - 02:38 PM, Fri - 18 October 24

Karnataka : కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముడా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కమిషనర్ రఘునందన్, ఇతర అధికారులతో ఈడీ అధికారులు మాట్లాడారు. ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఇదిలాఉంటే.. రెండురోజుల క్రితం ముడా అథారిటీ ఛైర్మన్ కె.మరిగౌడ రాజీనామా చేశారు. మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడని పేరుంది. అయితే.. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఆయన కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో అనారోగ్యం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముడా స్కామ్ వ్యవహారంలో సిద్ధరామయ్యతో పాటు మరిగౌడ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా.. ముడా స్కామ్ వ్యవహారం సీఎం సిద్ధరామయ్యను ముప్పతిప్పలు పెడుతోంది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలోనే ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసినా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ఒకవైపు సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతుండగా.. తాజాగా ముడా చీఫ్ రాజీనామా కన్నడనాట తీవ్ర చర్చకు దారితీసింది.