Supreme Court : బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.
- Author : Latha Suma
Date : 18-10-2024 - 1:44 IST
Published By : Hashtagu Telugu Desk
Child Marriage : బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక మర్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా దాన్ని అమలుచేయాలని సూచించింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్‌ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.
‘బాల్యవివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతం అవుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలి’ అని ధర్మాసనం పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు. ఈ చట్టాన్ని 1929 నాటి బాల్య వివాహ నిరోధక చట్టం స్థానంలో తీసుకొచ్చారు.