Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
- By Sudheer Published Date - 09:50 AM, Thu - 10 July 25

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపానికి (Earthquake ) వణికిపోయింది. గురువారం ఉదయం 9.04 గంటల సమయంలో ఢిల్లీ (Delhi ), ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైంది. భూకంప కేంద్రం హర్యానాలోని జజ్జర్‌గా గుర్తించబడింది. ఇది భూమి అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్న ప్రకంపన అని అధికారులు తెలిపారు.
CM Chandrababu : వైసీపీ తప్పుడు ప్రచారాలపై నిర్లక్ష్యం ఎందుకు? .. మంత్రుల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనాల్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు తక్షణమే ఆఫీసులను ఖాళీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులను భద్రతా దృష్టితో బయటకు తరలించారు.
భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే భవిష్యత్తులో మరింత ప్రకంపనలు రావచ్చనే భయంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నా, అది జనాభా దట్టంగా ఉన్న ప్రాంతంలో సంభవించడంతో భయం పెరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా ఉందని, భూకంప తీవ్రతపై ఇంకా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.