Fraud Couple : ఫ్రాడ్ కపుల్.. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి కూతురినంటూ మోసం
హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి దంపతులపై(Fraud Couple) డిసెంబరు 26న కేసు నమోదైంది. వారిని అరెస్టు కూడా చేశారు.
- By Pasha Published Date - 11:31 AM, Tue - 31 December 24

Fraud Couple : ఒడిశాకు చెందిన ఆ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి దంపతులు ఏకంగా ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా పేరును వాడుకొని ప్రజలను దగా చేశారు. తాను పి.కె.మిశ్రా కుమార్తెనని హన్సితా అభిలిప్సా చెప్పుకుంది. తాను పి.కె.మిశ్రా అల్లుడినని అనిల్ మహంతి చెప్పుకున్నాడు. ఈ ఛీటర్ దంపతులు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తమకున్న పరిచయాలతో పెద్దపెద్ద లాభదాయక టెండర్లను ఇప్పిస్తామంటూ మైనింగ్ వ్యాపారులు, నిర్మాణ రంగ వ్యాపారులు, బిల్డర్లను నమ్మించారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులతో తాము దిగినట్టుగా ఉన్న ఫొటోలను చూపించారు. అనంతరం ఆ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అనంతరం ఆ వ్యాపారులు ఫోన్ కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ దంపతుల చేతిలో దగాపడిన ఓ మైనింగ్ వ్యాపారి పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో విషయమంతా వెలుగుచూసింది. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి దంపతులపై(Fraud Couple) డిసెంబరు 26న కేసు నమోదైంది. వారిని అరెస్టు కూడా చేశారు.
Also Read :Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఎన్నికల వేడి.. అభ్యర్థుల ప్రచార హోరు
పీకే మిశ్రా కుమార్తెను అని చెప్పుకుంటూ మోసం చేసిన అభిలిప్సా బ్యాక్‌గ్రౌండ్ గురించి దర్యాప్తు చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఆమె గతంలో తనను తాను ఉన్నతాధికారి భార్యగా/ ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగా ప్రచారం చేసుకొని ఎంతో మందిని మోసం చేసినట్లు తేలింది. ఈవివరాలను అడిషనల్ డీసీపీ స్వరాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ ఛీటర్స్ జంట చేతిలో మోసపోయిన వారు ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అడ్డదారిలో ఈజీగా రూ.కోట్లను సంపాదించేందుకే ఈ జంట ఈవిధమైన మోసాలు చేసిందని దర్యాప్తులో గుర్తించారు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారం భువనేశ్వర్‌లోని వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది.